పేరుతో ఎంత కష్టం! అహ్మదాబాద్ లో ఒక వ్యాపారవేత్త ఉసామా దారువాలా వద్ద జనం తరచు సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. ఒసామా బినా లాదెనా అని చాలా మంది అడుగుతుంటారు. అటువంటివారికి ఆయన ఒక విధమైన నవ్వుతోనే 'కాదు, ఉసామా బిన్ ఇబ్రహీమ్' అని సమాధానం ఇస్తుంటారు.'మా తండ్రి పేరు ఇబ్రహీమ్' అని ఆయన చెబుతుంటారు. ప్రపంచంలో 'మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్' పేరును పోలిన పేరుతో మనుగడ సాగించడం తేలికేమీ కాదు. కాని 30 ఏళ్ల ఉసామా తన పేరు అర్థమేమిటో వివరిస్తుంటారు. మహమ్మద్ ప్రవక్తకు చేదోడు వాదోడుగా ఉండే ఒక సాహబీ పేరు తనకు పెట్టారని ఉసామా చెబుతుంటారు. 'నాకు ఈ నామకరణం చేసినప్పుడు ఒసామా బిన్ లాదెన్ అనే మనిషి ఉన్నాడనేది ఎవరికీ తెలియదు' అని ఉసామా చెబుతుంటారు. 'అయితే, జనం ఏమంటున్నదీ నాకు అనవసరం. నా పేరుకు మూలాలు ఖురాన్ లో ఉన్నాయి' అని ఆయన స్పష్టం చేశారు.
ఒసామా అనే పేరు ఉన్న వ్యక్తులు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. వారు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. మీకు ఎందుకు ఆ పేరు పెట్టారని ఎవరైనా ప్రశ్నిస్తే సదరు వ్యక్తుల వైపు వారు అనుమానంగా చూస్తారు. ఆ టెర్రరిస్టు స్ఫూర్తితో తమకు నామకరణం జరగలేదని వారు స్పష్టం చేస్తుంటారు. తమకు ఆ పేరు ఎందుకు పెట్టవలసివచ్చింది వంటి ప్రశ్నలు అడగసాగితే వారు అలా అడిగినవారితో మాట్లాడడానికి నిరాకరిస్తుంటారు కూడా.
ఉదాహరణకు సద్దామ్ బంజారా తలపై జుట్టు పూర్తిగా తీయించుకున్నారు. ఆయన తలపై ప్రార్థన సమయంలో వలె టోపీ ధరించేంత వరకు ఆయనను ముస్లిం అని ఎవరూ అనుకోరు. 'ఎప్పుడైనా నేను నా పేరు చెబితే ఎవరో ఒకరు ఆశ్చర్యంగా నావైపు చూస్తుంటారు' అని 20 సంవత్సరాల మోటార్ సైకిల్ మెకానిక్ సద్దామ్ బంజారా చెప్పారు. 'సద్దామ్ హుస్సేన్ పేరు పెట్టినందుకు నాకు గర్వంగా ఉంటుంది' అని కూడా ఆయన చెప్పారు.
ఇక 'దావూద్' అనే పేరు కొన్ని సంవత్సరాల క్రితమే దాదాపు అదృశ్యమైంది. తమ పిల్లలకు ఆ పేరు పెడితే మాఫియా డాన్ గుర్తుకు వస్తాడేమోననే భావనతో ఎవరూ ఆ పేరు పెట్టడానికి ఇష్టపడకపోవడం ఇందుకు కొంత కారణం. అయితే, గుజరాత్ లోని భరూచ్ పట్టణానికి చెందిన, ప్రస్తుతం యుకెలో స్థిరపడిన 65 సంవత్సరాల రిటైరైన వ్యాపారవేత్త దావూద్ ఇబ్రహీమ్ ఈ విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ఆయన ఒక దశలో తన పేరు మార్చుకోవాలని కూడా అనుకున్నారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ విభాగాల మీదుగా సాగడం పీడకలలా ఉంటున్నదని ఆయన ఇండియాలోని తన మిత్రుల వద్ద వాపోయారు కూడా. ఇతర ప్రయాణికుల కంటె ఎక్కువగా ఆయనను తనిఖీ చేస్తుంటారని, ఇబ్బందికర ప్రశ్నలు అనేకం అడుగుతుంటారని ఆయన తెలిపారు.
Pages: -1- 2 -3- News Posted: 1 March, 2010
|