వార్తలకు 'నెట్' వాషింగ్టన్ : అమెరికాలో వయోజనులకు వార్తలు తెలుసుకునేందుకు విశేషంగా ఉపయోగించే వేదికలలో ఇంటర్నెట్ మూడవ స్థానం ఆక్రమిస్తున్నదని, స్థానిక, జాతీయ టెలివిజన్ కేంద్రాలు మొదటి రెండు స్థానాలలో ఉన్నాయని సోమవారం విడుదలైన ఒక సర్వే నివేదిక వెల్లడించింది. ప్యూ రీసర్చ్ సెంటర్స్ ఇంటర్నెట్, అమెరికన్ లైఫ్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ప్రశ్నించిన 2259 మంది వయోజనులలో 78 శాతం మంది ఏ రోజునైనా తాము స్థానిక టివి కేంద్రం ద్వారా వార్తలు తెలుసుకుంటామని చెప్పారు. సిబిఎస్ వంటి జాతీయ టివి నెట్ వర్క్ లేదా సిఎన్ఎన్ లేక ఫాక్స్ వంటి కేబుల్ టివి న్యూస్ స్టేషన్ నుంచి తాము వార్తలు తెలుసుకుంటామని 73 శాతం మంది వెల్లడించారు.
61 శాతం మంది తాము ఏ రోజునైనా ఆన్ లైన్ లో వార్తలు తెలుసుకుంటామని చెప్పగా 54 శాతం మంది ఇంటిలో గాని, కారులో గాని రేడియో వార్తలు వింటామని తెలిపారు. 50 శాతం మంది తాము స్థానిక దినపత్రికలో వార్తలు చదువుతామని చెప్పగా 17 శాతం మంది న్యూయార్క్ టైమ్స్ లేదా యుఎస్ఎ టుడే వంటి జాతీయ దినపత్రికలో వార్తలు చదువుతామని తెలియజేశారు. స్థానిక దినపత్రిక లేదా జాతీయ దినపత్రిక, స్థానిక టివి వార్తా ప్రసారాలు లేదా జాతీయ టివి వార్తా ప్రసారాలు, రేడియో లేదా ఇంటర్నెట్ అనే మూడు మీడియా వేదిక (మార్గా)లలో కనీసం ఒకదాని ద్వారా తాము వార్తలు తెలుసుకుంటామని 99 శాతం మంది చెప్పారు. ఇక 92 శాతం మంది తాము ఏ రోజునైనా నాలుగు నుంచి ఆరు మార్గాలలో వార్తలు తెలుసుకుంటామని చెప్పారు.
ఆన్ లైన్ లో వార్తలు తెలుసుకునే అమెరికన్ వయోజనులలో 21 శాతం మంది వార్తలు, సమాచారం కోసం కేవలం ఒక వెబ్ సైట్ పై ఆధారపడతారని, కాని 57 శాతం మంది రెండు నుంచి ఐదు వెబ్ సైట్ లను పరిశీలిస్తారని సర్వేలో వెల్లడైంది. 11 శాతం మంది తాము ఐదుకు పైగా వెబ్ సైట్ ల నుంచి వార్తలు తెలుసుకుంటామని చెప్పగా 65 శాతం మంది తమకు ఇష్టమైన సైట్ అనేది ఏదీ లేదని తెలిపారు.
Pages: 1 -2- News Posted: 2 March, 2010
|