'పురాతన' డైరెక్టరీ న్యూఢిల్లీ : దేశంలో ఉన్న పురావస్తువులు, కళాఖండాల వివరాలను నమోదు చేసే బృహత్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. క్రితం సంవత్సరం మహాత్మా గాంధి వస్తువులను ఒక విదేశీ వస్తు సేకరణకర్త వేలం వేసినప్పుడు తలెత్తిన వివాదం పునరావృతం కాకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ పనికి పూనుకుంటున్నది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ నమోదు (డాక్యుమెంటేషన్) ప్రక్రియలో పాలు పంచుకోవలసిందిగా పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలను జాతీయ స్మారకచిహ్నాలు, పురావస్తువుల సంస్థ (ఎన్ఎంఎంఎ) ఆహ్వానించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఉన్న స్మారక చిహ్నాలు, పురావస్తువుల జాతీయ రిజిస్టర్ ను రూపొందించాలని సంకల్పించిన ఈ సంస్థ ఇందు నిమిత్తం రాష్ట్ర స్థాయిలో కూడా సంస్థలను ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం దేశంలో ఉన్న పురావస్తు సంపద గురించిన సమాచారం ఏదీ ప్రభుత్వం వద్ద లేదు. 'మన పురావస్తువులకు సంబంధించి సరైన జాతీయ రిజిస్టర్ ఏదీ లేకపోవడం శోచనీయం. వరల్డ్ మెమోరియల్ రిజిస్టర్ తరహాలో ఈ సంస్థ ద్వారా ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో గల ఈ వస్తువులపై జాతీయ డైరెక్టరీని రూపొందించాలని యోచిస్తున్నాం' అని ఎన్ఎంఎంఎ డైరెక్టర్ ఆర్.ఎస్. ఫోనియా చెప్పారు.
మహాత్మా గాంధి ఉపయోగించిన వస్తువులను క్రితం సంవత్సరం వేలం వేయడంపై వివాదం తలెత్తినప్పుడు ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. గాంధీజీ ఒకప్పుడు ఉపయోగించిన జెనిత్ పాకెట్ వాచీ, కళ్లజోళ్లు, చెప్పులు, కంచం, పళ్లెంతో సహా కొన్ని వస్తువులు ఒక విదేశీ వస్తు సేకరణ కర్త చేతుల్లోకి వెళ్లాయి. ఆ వస్తువుల అమ్మకం వల్ల 1.8 మిలియన్ డాలర్లు (రూ. 8 కోట్లకు పైగా) ఆదాయం వచ్చింది. ఆ వేలం కార్యక్రమం అనంతరం ప్రభుత్వం రంగంలోకి దిగి, మహాత్మా గాంధి వాడినవి పురావస్తువులని ప్రకటించి, వాటిని వేలం వేయడాన్ని, లేదా అమ్మడాన్ని నిషేధించింది.
Pages: 1 -2- News Posted: 8 March, 2010
|