'పురాతన' డైరెక్టరీ ముందుగా ఎన్ఎంఎంఎ ప్రభుత్వ పరిధిలో ఉన్న పురావస్తువుల సమాచారాన్ని డిజిటైజ్ చేస్తుందని ఫోనియా తెలియజేశారు. స్మారక చిహ్నాలు, పురావస్తువులను పరిశీలించి, నమోదు చేసేందుకు జిల్లా స్థాయిలో సంస్థలను ఏర్పాటు చేయవలసిందిగా రాష్ట్రాలను ఈ సంస్థ కోరినట్లు ఆయన తెలిపారు. 'పురావస్తువు ఏదైనా కావచ్చు. స్థానిక మార్కెట్ లేదా క్లాక్ టవర్ లేదా చివరకు హవేలి కావచ్చు. ఏదైనా వస్తువుకు పురాతన వస్తువు విలువ ఉందని ఎవరైనా భావిస్తే వారు జిల్లా అధికారులకు సమాచారం అందజేయవలసి ఉంటుంది. అయితే, అటువంటివి 1950కి ముందు నిర్మితమై ఉండాలి' అని ఫోనియా సూచించారు.
ఆతరువాత ప్రైవేట్ పరిధిలోని పురావస్తువుల సమాచారాన్ని డిజిటైజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే, తాము సేకరించిన పురావస్తువుల సమాచారాన్ని బహిర్గతం చేయడానికి ఆయా వ్యక్తులు సుముఖంగా ఉన్నప్పుడే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. దీని కోసం ప్రభుత్వం 100 సంవత్సరాలకు తక్కువ కాకుండా అస్థిత్వం ఉన్న ఏ వస్తువునైనా పురావస్తువుగా ప్రకటించాలని యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఏ వస్తువునైనా పురావస్తువుగా ప్రకటించినట్లయితే దాని యజమాని ప్రభుత్వం వద్ద దాని నమోదు చేయవలసి ఉంటుంది. అతను దానిని విక్రయించరాదు.
ఈ విషయమై చైతన్య పరిచేందుకు జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని ఎన్ఎంఎంఎ యోచిస్తున్నది. స్మారక చిహ్నాలు, పురావస్తువుల భద్రత, సంరక్షణ చట్టాల కాపీలను తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, ఒరియా, హిందీ, పంజాబీ, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీతో సహా 12 ప్రాంతీయ భాషలలో విడుదల చేయాలని సంస్థ నిశ్చయించింది. స్మారక చిహ్నాలు, పురావస్తువుల భద్రత, సంరక్షణకు సంబంధించిన రెండు ప్రధాన చట్టాలు - 'ప్రాచీన స్మారక చిహ్నాలు, పురాతత్వ స్థలాలు, శిథిలాల చట్టం 1958', 'పురావస్తువులు, కళా నిక్షేపాల చట్టం 1972' ప్రస్తుతం ఇంగ్లీషు భాషలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ డాక్యుమెంటేషన్ ప్రక్రియ మొత్తాన్ని 2012 నాటికి పూర్తి చేయాలని ఎన్ఎంఎంఎ యోచిస్తున్నట్లు ఫోనియా చెప్పారు.
Pages: -1- 2 News Posted: 8 March, 2010
|