బౌలర్ల వైఫల్యమే కారణం
కొలంబోః అనుభవంగల బౌలర్లు లేనందువల్లనే శ్రీలంకతో జరిగిన ఐదో వన్డే పోటీలో భారతజట్టు ఓడిపోయిందని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్ లో 68 పరుగుల తేడతో ఓడిపోవడంతో వరుసగా తొమ్మిది మ్యాచ్ లలో గెలుపొందిన రికార్డును ఇండియా చేజార్చుకున్న విషయం తెలిసిందే. పేస్ బౌలర్ జహీర్ ఖాన్, స్పిన్నర్ ప్రగ్యాన్ ఓఝా, బ్యాట్స్మన్ సచిన్ టెండుల్కర్ లను ఈ మ్యాచ్ లో పక్కన కూర్చోబెట్టిన కెప్టెన్ ధోని మూడో మ్యాచ్ తోనే సిరీస్ మన వశమయినందువల్ల యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న కీలకమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పాడు. మన బౌలింగ్ పటిష్టంగా లేదని, అయినా ఇంతవరకూ అంతర్జాతీయ పోటీలలో ఆడని రవిందర్ జడేజాలాంటి యువ ఆటగాళ్లకి చక్కటి అవకాశం లభించచిందని ధోనీ అన్నాడు. ఈ సిరీస్ విజయం జట్టు సభ్యులకే అంకితమన్నాడు.
ఇకపై కూడా మరిన్ని టోర్నమెంట్ లలో భారతజట్టు విజయ పరంపరను కొనసాగించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. జట్టుకు ఓదార్పుగా లభించిన ఈ విజయానికి కారణం తమ బ్యాట్స్ మెన్ అని శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్దనె అన్నాడు. ఇందుకు పిచ్ కూడా బాగా సహకరించిందని చెబుతూ జయసూర్య, తిలకరత్నె అద్భుతంగా ఆడి జట్టు స్కోరును 300 పరుగులు దాటించారని, ఆ తరువాత నుంచి ఆట పూర్తిగా తమ అదుపులోకి వచ్చిందన్నాడు. భారత జట్టు తొలి మ్యాచ్ నుంచి ఉత్తమంగా ఆడింది కనుకనే సిరీస్ కైవసం చేసుకుందని, ప్రస్తుత అగ్రశ్రేణి జట్లలో భారతజట్టు ఒకటని జయవర్దనె చెప్పాడు. మరి కొద్ది రోజులలోనే పాకిస్తాన్ తో సిరీస్ ఆడాల్సి ఉన్నందున ఆదివారం మ్యాచ్ నెగ్గితీరాలని తాము తీర్మానించుకున్నామన్నాడు. ఈ సిరీస్ లో మొత్తం 284 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకున్న యువరాజ్ సింగ్ తాను అంత అద్భుతంగా ఆడడానికి కారణం, టెండుల్కర్ చెప్పిన కిటుకులను తుచ తప్పకుండా పాటించడమేనని చెప్పాడు.
News Posted: 9 February, 2009
|