ఐపిఎల్ ఓనర్ల మల్లగుల్లాలు
న్యూఢిల్లీః ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)జమా ఖర్చుల లెక్కల్లో వివిధ జట్ల యజమానులు తలమునకలై వున్నారు. ఒక ఐపిఎల్ జట్టు నిర్వహణకు ఏడాదికి 100 నుంచి 120 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. దీనిలో సుమారు 40 కోట్ల రూపాయలు వేతనాలకు, రూ.32.58కోట్ల నుంచి సుమారు 50కోట్ల వరకు ఫ్రాంచైజీ ఫీజు, వీటన్నింటినీ మించి ఈవెంట్ కాస్ట్, అంటే ఏడు మ్యాచ్ లను నిర్వహించడం, హోటల్ ఖర్చులు, విమానం టికెట్లు, సిబ్బంది ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఏవో కొన్ని మినహాయిస్తే, చాలావరకు ఆపరేషనల్ ఖర్చులలో మార్పేమీ ఉండదని ఒక జట్టు ఉన్నతాధికారి ఒకరు, గోవా జట్టు వేలం పూర్తయ్యాక చెప్పారు. దీని ప్రభావం అడ్వర్టయిజింగ్, గేటు వసూళ్ల మీద తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకు, టికెట్ ధరలను మరోసారి పరిశీలించాల్సి వుందనీ, ఖరీదైన టికెట్లను జనం కొనలేరని తెలిసినపుడు, వాటిని అమ్మకానికి పెట్టడం అనవసరమని ఒక జట్టు యజమాని చెప్పారు.
అటువంటప్పుడు ఐపిఎల్ వంటి వ్యాపారాల్లో పెట్టుబడులను కొనసాగించడం ఎందుకనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి జవాబు చెప్పడం కష్టమేమీ కాదంటారు మరో యజమాని. క్రికెట్ పేరుతో లాభసాటిగా నడవని వ్యాపారం ఈ రోజుల్లో లేదన్నది ఆయన వాదన. క్రికెట్ లో పెట్టుబడి పెట్టినందు వల్ల కంపెనీ పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయని, ఒక్కొక్క కంపెనీ ఒక్కో విధంగా లాభపడుతుందని ఇంకో యజమాని చెప్పారు. ఇదంతా మరోసారి మరోసారి ఆలోచించడం, కొత్త కొత్త పద్ధతులను కనుక్కోవడం తప్ప మరింకేమీ కాదని ఆయన అంటూ, విజయ్ మాల్య, అంబానీలాంటి బడా వ్యాపారవేత్తలు ఏడాదికి 50 కోట్ల రూపాయల నష్టాన్ని భరించగలరనీ, వారి అడ్వర్టయిజ్మెంట్ బడ్జెట్ లే 400 నుంచి 500 కోట్ల రూపాయలవరకూ ఉంటుందని చెప్పారు. మరి ఈ వ్యాపారంలో ఆదాయవనరులేమిటి? 'స్పాన్సర్ షిప్ లు(జట్టు, దుస్తులు, స్టేడియంలో అడ్వర్టయిజ్ మెంట్ హక్కులు మొదలైనవి), గేటు వసూళ్లతో పాటు ఐపిఎల్ సెంట్రల్ స్పాన్సర్ షిప్ లో వాటా.'
ఐపిఎల్ బరిలో దిగిన వ్యాపారులందరూ మూడు నుంచి ఐదేళ్ల వరకూ వేచి చూసి ఆ తరువాత లాభాలు ఆర్జిద్దామనుకుంటున్నవారే. ఆఖరికి ఏ యేడాదికి ఆ యేడాదే ఆదాయ వ్యయాలు సమానం చేసుకుంటామని బహిరంగంగా ప్రకటించిన కోల్కటా రైడర్స్ జట్టే ప్రస్తుతం నష్టాలను మౌనంగా భరిస్తోంది.
News Posted: 9 February, 2009
|