ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ వీరూ
న్యూఢిల్లీః డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహవాగ్ ను 2007-2008 సంవత్సరానికి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా భారత క్రికెట్ నియంత్రణ మండలీ నిర్వాహకులు సోమవారం ప్రకటించారు. భారత జట్టు మాజీ కెప్టెన్ పాలీ ఉమ్రీగర్ పేరిట నెలకొల్పిన అవార్డును ఈ నెల 18న బీసీసీఐ ముంబాయిలో నిర్వహించే కార్యక్రమంలో సెహవాగ్(30)కు బహూకరిస్తారు. 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో భారతజట్టులో మళ్లీ స్థానం సంపాదించిన సెహవాగ్ అప్పటినుంచి బ్యాటింగ్ లో తనదైన శైలిలో విజృంభించి ఆడుతున్నాడు.అంతకుముందు బంగ్లాదేశ్, ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లతో జరిగిన సిరీస్ లో అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. 2008 సంవత్సరంలో సెహవాగ్, చెన్నైలో దక్షిణాఫ్రికాపై ఒక టెస్ట్ లో ట్రిపుల్ సెంచరీతో సహా 14 టెస్ట్ మ్యాచ్లలో 1,462 పరుగులు చేశాడు. అంతకుముందు 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ట్వంటీ 20 ప్రపంచకప్ సాధించిన భారతజట్టులో కూడా సెహవాగ్ ఆడాడు.
దేశవాళీ క్రికెట్ లో ఉత్తమ బౌలర్ గా, రంజీ ట్రోఫీలో 41(21.63 పరుగులకు)వికెట్లు సాధించిన ఉత్తర ప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ సుదీప్ త్యాగి ఎంపికయ్యాడు.
భారత క్రికెట్ కు ఎనలేని సేవలందించిన మాజీ టెస్ట్ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్, లెజెండరీ బ్యాట్స్ మన్ సికె నాయుడు అవార్డును అందుకోనున్నాడు. 1969లో ఆస్ట్రేలియాతో ఆడిన తన తొలి టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేసిన విశ్వనాథ్, ఇంతకుముందు భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించాడు.గత నెలలో పద్మశ్రీ అవార్డులు అందుకున్న మహేంద్ర సింగ్ ధోని, హర్భజన్ సింగ్ కూడా బిసిసిఐ స్పెషల్ అవార్డులు అందుకోనున్నారు.ధోని ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు సారథ్యంవహించగా, గత అక్టోబర్-నవంబర్ లో మన దేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో 300 టెస్ట్ వికెట్లను అధిగమించాడు.
News Posted: 9 February, 2009
|