మల్టీప్లెక్స్ లో ఐపిఎల్
ఢిల్లీ: వచ్చే ఏప్రిల్ 10 నుంచి ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నమెంట్ మ్యాచ్ లను థియేటర్లలో ప్రదర్శించడానికి హక్కులకోసం పివిఆర్, ఐనాక్స్ లీజర్, సినీమాక్స్, బీగ్ సినిమాస్ తదితర మల్టిప్లెక్స్ చైన్ సంస్థలు పోటీపడుతున్నాయి. రోజుకు కనీసం ఒక ఐపిఎల్ మ్యాచ్ ప్రత్యక్షంగా చేయడానికి హక్కులకోసం సంప్రదింపులు జరుపుతున్న ఈ కంపెనీలు, స్టేడియంలో కనీస టికెట్ ధరలో సగానికే, స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న అనుభూతి కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి.క్రికెట్ పోటీలకు సంబంధించినంతవరకూ భారత క్రికెట్ కంట్రోలు బోర్డు థియేటర్ హక్కులు కలిగి వుండగా, భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కేబుల్, డైరెక్ట్ టు హోమ్(డిటిహెచ్)ప్రసారహక్కులు సెట్ మాక్స్ అధీనంలో వున్నాయి. 'ఐపిఎల్ మ్యాచ్ ల ప్రసారానికి థియేటర్ హక్కులు మాకు లేనందువల్ల మల్టీప్లెక్స్ కంపెనీలు బీసీసీఐతోనే నేరుగా మాట్లాడుకోవాల'ని సెట్ మాక్స్ చానెల్ నిర్వాహక కంపెనీ మల్టై స్క్రీన్ మీడియా నెట్ వర్క్ సేల్స్ విభాగం అధ్యక్షుడు రోహిత్ గుప్తా చెప్పారు.
అయితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రెవెన్యూలో వాటా, కనీస గ్యారంటీ తదితర అంశాలపై ఒప్పందం కుదుర్చుకోడానికి ప్రస్తుతం సెట్ మాక్స్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో షరతులు, ఒప్పందాలపై చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయని, త్వరలోనే నిర్ణయాలు తీసుకోనున్నామని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి.'ఐపిఎల్ మ్యాచ్ ల ప్రదర్శన హక్కులు మల్టీప్లెక్స్ లకు లభిస్తే టెలివిజన్ రేటింగ్ లు పడిపోతాయని సెటం మాక్స్ భయపడుతోంది. చానెల్ లో అడ్వర్టయిజింగ్ స్పాట్ రేట్లకు, టివి రేటింగులకు సంబంధం వుంది' అని ఐపిఎల్ ఫ్రాంచైజ్ జట్లతో ఒప్పందంగల ఒక స్పోర్ట్స్ మార్కెటింగ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.
మరోవైపు, మామూలుగా సినిమాలు ప్రదర్శిస్తున్న మాదిరిగానే, థియేటర్ హక్కులు గల సంస్థతో రెవెన్యూలో వాటా తీసుకోడానికి అభ్యంతరం లేదని మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులు స్పష్టంగా చెబుతున్నారు.ఐపిఎల్ మ్యాచ్ లకు టికెట్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో, ముందుగా నిర్ధారించిన శాతాన్ని ఇవ్వడానికి సిద్ధమేనని సినీమాక్స్ ఇండియా సీనియర్ వైస్ చైర్మన్ దేవాంగ్ సంపత్ చెప్పారు. ప్రతి రోజూ ఐపిఎల్ పోటీలను ప్రదర్శించడానికి సిద్ధమేనని, ముచి ఆదాయం లభిస్తుందని, అన్ని మల్టీప్లెక్స్ లలో ఒకే తెర ప్రదర్శిస్తామని పివిఆరం సినిమాస్ సిఇఓ గౌతమ్ దత్తా అన్నారు.
ఈ ఎగ్జిబిటర్లు చబుతున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, థియేటర్లలో సినిమాలు కాకుండా ఇతర కార్యక్రమాలను ప్రదర్శించాలంటే, వినోదం పన్ను సంబంధిత అంశాలతోపాటు సినిమాటోగ్రఫీ చట్టంలో కొన్ని సవరణలు అవసరం. థియేటర్లలో 35ఎంఎం సినిమాల ప్రదర్శనకు మాత్రమే అనుమతి ఇచ్చే సినిమాటోగ్రఫీ చట్టానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఐనాక్స్ లీజర్ ఉపాధ్యక్షుడు ఉత్పల్ ఆచార్య స్పష్టంచేశారు. సినిమా కాకుండా ఇతర టెలీకాస్ట్ లను ప్రదర్శించే మల్టీప్లెక్స్ థియేటర్లు ఆక్యుపెన్సీ రేటు నూరు శాతం ప్రాతిపదికగా వినోదం పన్ను చెల్లించవలసి వుంటుంది. అంటే ఏ ఐపిఎల్ మ్యాచ్ కైనా 50 టికెట్లు మాత్రమే అమ్ముడైనా, ఆ హాలు మాత్రం పూర్తి శాతం వినోది పన్ను చెల్లించవలసిందే.
News Posted: 10 February, 2009
|