ట్వంటీ20 విజేత భారత్
కొలంబో :నరాలు తెగే ఉత్కంఠతో,రక్తం ఉరుకులతో గుండె వేగాన్ని అనుక్షణం పెంచేస్తూ సాగిన ట్వంటీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ లో భారత్ విజయఢంకా మ్రోగించింది. పఠాన్ బ్రదర్స్ శ్రీలంక బౌలర్లను చివరి ఓవర్లలో చితక్కోట్టి మ్యాచ్ ను భారతకు అందించారు. ప్రపంచ ఛాంపియన్ ప్రతిష్టను నిలబెట్టారు. ప్రేమదాస స్టేడియంలో మంగళవారం రాత్రి క్రికెట్ ప్రేమికులకు బారత్,శ్రీలంక బ్యాట్స్ మెన్ సిక్సర్లు,ఫోర్లతో పరుగుల వరద పారించి కనువిందు చేసారు.టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. శ్రీలంక సారథి దిల్షాన్ 47 బంతుల్లో 61 పరుగులు చేసి భారీ స్కోరుకు కారణమయ్యాడు. ట్వంటీ20లో తన మొదటి అర్ధ సెంచరీని నమోదు చేసుకున్నాడు.అనుభశాలి జయసూర్య 33 పరుగులు చేసి సహచరుల్లో స్పూర్తిని నింపాడు. భారత్ బౌలర్లలో యూసఫ్ పఠాన్ నాలుగు ఓవర్లు వేసి 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకుంటే ఇర్ఫాన్ పఠాన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలోనే తడబడింది.కేవలం 14 పరుగులకే ఓపెనర్లు సెహ్వాగ్,గంభీర్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. సెహ్వాగ్ ఒక పరుగు చేసి రన్ ఔట్ గా పెవిలియన్ చేరుకున్నారు.సురేశ్ రైనా,యువరాజ్ సింగ్ సమన్వయంతో ఆడుతూ మ్యాచ్ పై పట్టు సడలకుండా స్కోర్ ను పరుగులేత్తించారు. ఆ దశలో యువరాజ్ అవుట్ కావడంతో వెంటనే రైనా పెవిలియన్ బాట పట్టడంతో మ్యాచ్ ఒక్కసారిగా శ్రీలంక వైపు మొగ్గు చూపింది.ఆ తరువాత కెప్టన్ ధోని, అజయ్ జడేజాలు కూడా శ్రీలంక బౌలర్ల ధాటికి తలోంచడంతో పఠాన్ బ్రదర్స బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. రావడంతోనే యూసఫ్ పఠాన్ బ్యాట్ ను ఝళిపించి సిక్సర్లు,ఫోర్లతో విరగదీశాడు.అన్నవిజృంభణతో స్పూర్తి పొందిన ఇర్ఫాన్ బ్యాట్ కు పనిచెప్పాడు.16 బంతుల్లో 32 పరుగులు చేశాడు.మలింగ వేసిన చివరి ఓవర్ రెండో బంతిని స్టాండ్స్ పంపించి ఇర్ఫాన్ విజయాన్ని పూర్తి చేశాడు. కేవలం పది బంతుల్లోనే 22 పరుగులు చేయడమే కాకుండా రెండు వికెట్లు తీసిన యూసఫ్ కు మ్యాన్ ఆఫ్ ధ మ్యాచ్ అవార్డు లభించింది.
News Posted: 10 February, 2009
|