కెప్టెన్సీకి మహేల గుడ్ బై
కొలంబొ: భారతజట్టు చేతిలో సిరీస్ ఓటమి, తన ఫామ్ లను దృష్టిలో పెట్టుకుని, వచ్చే పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ తరువాత శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేయనున్నట్టు మహేల జయవర్దనె ప్రకటించాడు. మంగళవారం ఇండియాతో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్ నుంచి జయవర్దనెను సెలెక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో తిలకరత్నె దిల్షాన్ శ్రీలంకకు సారథ్యంవహించాడు. 'శ్రీలంక జట్టు ప్రయోజనాల దృష్ట్యా, పాకిస్తాన్ పర్యటన తరువాత కెప్టెన్ పదవినుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాన'ని జయవర్దనె ఒక ప్రకటనలో తెలిపాడు. తన తరువాత కెప్టెన్ 2011 ప్రపంచకప్ పోటీల సమయానికి పరిణతిచెంది వుండాలంటే కనీసం 18 నెలల వ్యవధి అవసరమని తాను చాలా రోజులుగాభావిస్తున్నానని, ఈ విషయమై బాగా ఆలోచించిన మీదట, శ్రీలంక జట్టుకు కొత్త సారథి పగ్గాలు చేపట్టవలసిన సమయం ఆసన్నమయిందని అనుకుంటున్నాననిఅతడు పేర్కొన్నాడు. గత మూడు సంవత్సరాలుగా జట్టుకు నాయకత్వం వహించే అవకాశం,గౌరవం లభించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. జయవర్దనె తరువాత వికెట్ కీపర్ కుమార సంగక్కర కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించనున్నాడు.
News Posted: 11 February, 2009
|