ట్వంటీకి సచిన్ దూరం
ముంబాయి: గత సంవత్సరం శ్రీలంక పర్యటనలో అనుభవంలోకి వచ్చిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) అంపైర్ల రిఫరల్ విధానం తనకు సంతృప్తి కలిగించలేదని మాస్టర్ బ్యాట్స్ మన్ సచిన్ టెండుల్కర్ చెప్పాడు. టెస్ట్ క్రికెట్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపట్టిన ఈ పద్ధతిలో, రనౌట్ లు కాకుండా కాట్ బిహైండ్, ఎల్.బి.డబ్ల్యు నిర్ణయాలపై కూడా మూడో అంపైర్ సూచనను పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఈ విధానంలో నిర్ణయాలు అనిశ్చితంగానే వున్నాయని, అలాగే హాక్ ఐ కెమేరా బ్యాట్స్ మన్ కు 22 గజాల దూరంలో వున్నందు వల్ల, బంతి బ్యాట్స్ మన్ ప్యాడ్ లకు తగలకపోతే వికెట్ లకు తగులుతుందో లేదో ఇతమిత్థంగా నిర్ణయించడం సాధ్యంకాదు కాబట్టి ఎల్.బి. నిర్ణయాలు కూడా సంతృప్తికరంగా లేవని అవైవా లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త ప్రాడక్టు విడుదల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన స చిన్ అన్నాడు.
ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనలో జరిగే రెండు ట్వంటీ 20 ఇంటర్నేషనల్ పోటీలలో తాను ఆడదలచుకోలేదని సచిన్ టెండుల్కర్ చెప్పాడు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ట్వంటీ 20 ప్రారంభ ప్రపంచకప్ విజేత అయిన భారతజట్టు ప్రస్తుతం పటిష్టంగా వుందని, నిలకడగా ఆడుతోందని, దాని సమతుల్యాన్ని దెబ్బతీయడం సబబుకాదు కాబట్టి తాను ఇకమీదట ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో ఆడదలచుకోలేదని సచిన్ వివరణ ఇచ్చాడు.
News Posted: 12 February, 2009
|