వరల్డ్ కప్ అసాధ్యం కాదు
భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోనీ అనతికాలంలోనే ఉన్నత శిఖరాలకు చేరుకుని అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. ఈ విషయంలో తానేమీ తీసిపోలేదంటున్నది ఝులన్ గోస్వామి. పశ్చిమ బెంగాల్ లోని కుగ్రామం చక్దాలో ప్రారంభమైన ఆమె క్రికెట్ జీవితం జాతీయజట్టులో ఫాస్ట్ బౌలర్ ప్రస్థానానికి చేరుకుని, వచ్చే నెల ఆస్ట్రేలియాలో జరగబోయే ప్రపంచ కప్ పోటీలలో జట్టుకు సారథ్యంవహించే స్థాయికి చేరుకుంది. కేవలం దృఢచిత్తం, సాహసం, అంకితభావం ఆమె విజయానికి సోపోనాలయ్యాయి. భారతజట్టుకు నాయకత్వంవహించే అవకాశం రావడం ఎంతో గర్విచదగ్గ, గౌరవపూర్వకమైన అనుభూతి అనీ, ఎంతకాలంగానో తాను కంటున్న కలలు నిజమయ్యాయని ఆమె ఒక వార్తా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. క్రికెట్ పరమపద సోపానంలో సుదీర్ఘమైన తన అనిభవాల గురించి,ప్రపంచ కప్ లో భారతజట్టు అవకాశాల గురించి ఆమె మాటల్లో...
'ఈసారి మన జట్టు వరల్డ్ కప్ గెలుచుకునే అవకాశాలు మెండుగా వున్నాయి. జట్టు నిర్మాణం, అటు అనుభవం, ఇటు కొత్తరక్తంతో సమతూకంగా వుంది. ఆటను అవసరమైన మలుపులు తిప్పగల ఆల్ రౌండర్లు ఎక్కువమందే వున్నారు. అంజుమ్ చోప్రా, మిథాలి రాజ్, రుమేలి ధార్ ఇలా ఎవరైనా సరే మ్యాచ్ విన్నర్ పాత్రను పోషించగల సత్తా వున్నవారే. కాకపోతే క్రికెట్ ఎవరికివారే ఆడుకునే ఆట కాదు కాబట్టి అందరూ కలిసికట్టుగా ఆడితే అంచనాలకు మించిన విజయాలు సాధించగలమనే నమ్మకం నాకుంది. ప్రపంచ కప్ గెలుచుకోవాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ముఖ్యంగా ఫీల్డింగ్ లో ఏ మాత్రం లోటు కనిపించడానికి వీల్లేదు. ప్రస్తుతం ఫీల్డింగే ఇంకా వెరుగుపరచుకోవల్సివుంది. ఇక నా విషయానికి వస్తే, బౌలింగ్ గురించి ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. రాంకింగ్ అంటారా, వాటిమీద నాకెంతమాత్రం నమ్మకంలేదు. జట్టు విజయానికి మనమెంతపరకూ సాయపడుతున్నామన్నదే ముఖ్యం. అందులో నా వంతు పాత్ర సక్రమంగా పోషిస్తున్నంత కాలం రాంకింగ్ గురించి పట్టించుకోను.'
దేశవాళీ క్రికెట్ లో మహిళల టోర్నమెంట్ ల గురించి ఝులాన్ మాట్లాడుతూ, 'ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడి పరిస్థితులను ఇంకా మెరుగుపరచుకోవలసిన అవసరం వుంది. అందుకు అవకాశాలూ వున్నాయి. మా నైపుణ్యానికి మరింత పదును పెట్టుకోడానికి జాతీయస్థాయిలో పోటీల సంఖ్యను గణనీయంగా పెంచవలసిన అవసరం వుంది. ఈ పోటీల్లో అనుభవం అంతర్జాతీయ మ్యాచ్ లలో మరింతగా రాణించడానికి దోహదపడుతుంది. వీటితోపాటు, మహిళా క్రికెటర్లకు ధైర్య సాహసాలు, కృతనిశ్చయం, పూర్తి అంకితభావంతో పాటు కుటుంబం సహాయ సహకారాలు కూడా అవసరం. ఇవి లేకపోతే ముందుకు సాగడం సాధ్యంకాదు. మిగతా మహిళా క్రికెటర్ల మాదిరిగానే నేను కూడా ప్రారంభ దశలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. అయితే జీవితంలో నిలదొక్కుకోడానికి, రాటుదేలడానికి ఆ అనుభవం, శ్రమ అవసరం.'
తన అభిమాన క్రికెటర్, కెప్టెన్ సౌరవ్ గంగూలీ అని, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ అన్నా తనకిష్టమేనని ఝులాన్ చెప్పింది. నాయకులుగా వారిద్దరూ కొన్ని అసాధారణ లక్షణాలు గలవారని అన్నది. తాను బౌలింగ్ చేసేటప్పుడు కెప్టెన్ ననే విషయాన్ని పక్కన పెడతానని, వికెట్లు పడగొట్టడంపైనే దృష్టి పూర్తిగా కేంద్రీకరిస్తానని, మిగతా సమయంలోనే సర్వశక్తులూ కూడగట్టుకోడంపై శ్రద్ధవహిస్తానని చెబుతూ ఝులన్ ఇంటర్వ్యూ ముగించింది.
News Posted: 12 February, 2009
|