టెస్ట్ జట్టులో కులకర్ణి
ముంబాయి: వచ్చే వారం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారతజట్టులో ముంబాయి పేస్ బౌలర్ ధవల్ కులకర్ణికి స్థానం లభించింది. తమిళనాడు ఆటగాళ్లు లక్ష్మీపతి బాలాజీ, దినేష్ కార్తిక్ లను కూడా శుక్రవారం సమావేశమైన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇరవయ్యేళ్ల ధవల్ మినహా 16 మంది ఆటగాళ్లలో మరో కొత్త మొహం లేకపోవడం విశేషం. చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సారథ్యంలో చెన్నైలో సమావేసమైన సెలెక్షన్ కమిటీ న్యూజిలాండ్ తో జరగబోయే మూడు టెస్ట్ మ్యాచ్ లు, ఐదు వల్డేలు, రెండు ట్వంటీ మ్యాచ్ లకు వేర్వేరు జట్లను ప్రకటించింది.
కెప్టెన్ మహేంద్రసింగ్ కు స్టాండ్ బైగా దినేష్ కార్తిక్ ను, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పేసర్ మునాఫ్ పటేల్ లను మూడూ జట్లకు ఎంపికచేసిన సెలెక్టర్లు ఇటీవల శ్రీలంకపై సిరీస్ గెలుపొందిన వన్డే, ట్వంటీ జట్లనే న్యూజిలాండ్ పర్యటనకు పంపిస్తున్నారు. ఓపెనింగ్ బ్యాట్స్ మన్ మురళీ విజయ్ కు టెస్ట్ జట్టులో స్థానం లభించగా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రగ్యన్ ఓఝా వ్చే, ట్వంటీ జట్లకు మాత్రమే ఎంపికయ్యాడు. వెటరన్ బ్యాట్స్ మెన్ రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ టెస్ట్ జట్టులోను, సచిన్ టెండుల్కర్ టెస్ట్, వన్డే జట్లలోను చోటుచేసుకున్నారు.
న్యూజిలాండ్ పిచ్ లు సీమ్ బౌలర్లకు ఎక్కువగా అనుకూలిస్తాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సెలెక్టర్లు కేవలం ఇద్దరు స్పిన్నర్లను(హర్భజన్, అమిత్ మిశ్రా) మాత్రమే ఎంపికచేశారు. భారతజట్టు ఈ నేల 19న న్యూజిలాండ్ బయలుదేరుతుంది. 25వ తేదీన క్రైస్ట్ చర్చ్ లో ట్వంటీ మ్యాచ్ తో సిరీస్ మొదలవుతుంది. రెండో ట్వంటీ మ్యాచ్ ఫిబ్రవరి 27న విల్లింగ్టన్ లో జరుగుతుంది. ఆ తరువాత మార్చి 3న వన్డే సిరీస్, 18న టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతాయి.
టెస్ట్ జట్టు: ఎం.ఎస్.ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్, వి.వి.ఎస్.లక్ష్మణ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ, మునాఫ్ పటేల్, అమిత్ మిశ్రా, దినేశ్ కార్తిక్, ఎల్.బాలాజీ, ధవల్ కులకర్ణి, మురళీ విజయ్.
వన్డే జట్టు: ఎం.ఎస్.ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ, మునాఫ్ పటెల్, దినేశ్ కార్తిక్, సురేష్ రైనా, యూసఫ్ పఠాన్, ప్రగ్యన్ ఓఝా, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్, ఇర్ఫాన్ పఠాన్.
ట్వంటీ జట్టు: ఎం.ఎస్.ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మ, మునాఫ్ పటేల్, దినేష్ కార్తిక్, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్, ప్రగ్యన్ ఓఝా, రోహిత్ శర్మ, ప్రవీణ్ కుమార్, ఇర్ఫాన్ పఠాన్, రవీంద్ర జడేజా.
News Posted: 13 February, 2009
|