మోడీపై చీటింగ్ కేసు
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధిపతి లలిత్ మోడీని కష్టాలు వెన్నాడుతున్నాయి. ఇప్పటికే ఆయన మీద వున్న కేసులు చాలవన్నట్టు, జైపూర్ పేలుడు సంఘటన బాధితులకు సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం బహిరంగంగా వాగ్దానం చేసి సొమ్ము జమచేయలేదన్న ఆరోపణపై ఆయన మీద చీటింగ్ కేసు దాఖలయింది. నాగరిక్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ పండిట్ సురేశ్ మిశ్రా ఐపిసి 420(వంచన), 467(ఫోర్జరీ) సెక్షన్ ల కింద జ్యోతినగర్ పోలీసు స్టేషన్ లో మోడీపై ఎఫ్.ఐ.ఆర్ దాఖలుచేశారని స్టేషన్ ఇన్ ఛార్జి లఖన్ సింగ్ తెలిపారు. జైపూర్ బాంబు పేలుడు బాధితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వసుంధర రాజెకు లలిత్ మోడీ ఇచ్చిన చెక్కుకు సంబంధించి ఎఫ్.ఐ.ఆర్ దాఖలయిందని, ఈ వ్యవహారాన్ని పరిశీలించి వాస్తవాలు తెలుసుకుంటామని ఆయన చెప్పారు.
గత సంవత్సరం మే 13న జైపూర్ లో సంభవించిన బాంబు పేలుళ్ల బాధితుల సహాయార్ధం ఆరుకోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధిలో జమచేస్తామని ఐపిఎల్ మొదటి టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు మోడీ ప్రకటించారని, మే 17న ఇక్కడి ఎస్.ఎం.ఎస్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ తరువాత లలిత్ మోడీ ఆరు కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారని, కాని ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయలేదని సురేశ్ మిశ్రా ఆరోపించారు. ఆ పోటీని రద్దుచేయాలనీ లేదా దానిని చారిటీ మ్యాచం గా పరిగణించాలని యువమోర్చా డిమాండ్చేసిన దృష్ట్యా ఏదో కంటితుడుపు చర్యగా మోడీ ఆ చెక్కును ఇచ్చారని ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొన్నారు. 'ఆ తరువాతకొద్ది నెలలకు ఐపిఎల్ ను స్పాన్సర్ చేసిన కంపెనీలు నాలుగు కోట్ల రూపాయల చెక్కులు డిపాజిటం చేశాయి. మరి మిగతా సొమ్ము ఏమైనట్టు? దీనిమీద విచారణ జరిపించాలని మేం డిమాండ్ చేస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన మోడీపై ఇప్పటికే నాగూర్ జీల్లాలో కొంత భూమిని అక్రమంగా సంపాదించారన్న ఆరోపణపై కేసు దాఖలయింది.
News Posted: 16 February, 2009
|