మండిపడిన మోడీ
మండిపడిన మోడీ
ముంబాయి: అన్ని వైపులనుండి చట్టుముడుతున్న కోర్టు వివాదాలు, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ లో చెలరేగిన అసంతృప్తితో ఆగ్రహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) చైర్మన్ లలిత్ మోడీ జైపూర్ లో జరగాల్సిన ట్వంటీ20 మ్యాచ్ లను మరో చోటకు మార్చేస్తానని బెదిరించడం మొదలెట్టారు. ఇటీవల తనపై దాఖలైన ఓఫ్.ఐ.ఆర్ లు రాజకీయ కక్షలతో కూడికున్నవని ఆయన అన్నారు. ఐపిఎల్ మ్యాచ్ లు నిర్వహించే స్థలాలను నిర్ణయించే అధికారాన్ని పాలక మండలి తనకు ఇచ్చిందని, జైపూర్ నుంచి పోటీలను మార్చే విషయం పరిశీలనలో వుందని సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఆయన అన్నారు.'ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పోటీలను అడ్డుకోడానికి ప్రయత్నిస్తే అక్కడ జరగాల్సిన మ్యాచ్ లను మరోచోటుకు మార్చేస్తాం' అని మోడీ చెప్పారు.
నగరంలో బాంబు పేలుడు బాధితుల సహాయార్ధం ప్రకటించిన ఆరు కోట్ల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి జమచేయలేదన్న ఆరోపణపై జైపూర్ పోలీసు స్టేషన్ లో మోడీపై ఆదివారం చీటింగ్ కేసు నమోదయింది. అయితే అది తనను వేధించడానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నిన కుట్ర అని ఆయన ఆరోపణలను తోసిపుచ్చుతూ వ్యాఖ్యానించారు. 'ఈ దేశంలో మరెక్కడా ఉదయం చేసిన ఫిర్యాదులు సాయంత్రానికి ఎఫ్.ఐ.ఆర్ లుగా మారలేదు. నాపై వస్తున్న ఏ ఆరోపణలోనూ పస లేద'న్నారు. నాగూర్ జిల్లాలో కొంత భూమిని మోడీ అక్రమంగా సంపాదించారనన్న ఫిర్యాదు కూడా నమోదయింది.ఇందుకు సంబంధించి పోలీసులు ఆయనను ప్రశ్నించడం జరిగింది. ఇవి కాక రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ లో అధికారం కోసం కార్యదర్శి సుభాష్ జోషి మోడీతో తీవ్రంగా పోటీ పడుతున్నారు.
ఐపిఎల్ తొలి సీజన్ లో కప్ గెలుచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఈ యేడాది తమకు కావలసిన చోట ఫైనల్స్ ఆడే అవకాశం ఇచ్చారని, తాము ముంబాయిలోని క్రికెట్ క్లబ్ ను ఎంపికచేసుకున్నామని మోడీ చెప్పారు. లీగ్ మ్యాచ్ లకు సంబంధించినంతవరకు సంబంధిత ఫ్రాంచైజీలు గేటు వసూళ్లను పూర్తిగా తామే తీసుకుంటారని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా వంటి మ్యాచ్ నిర్వాహక సంఘాలఅధికారులతో లావాదేవీలు జరిపే అధికారం వారికి వుందని మోడీ వివరించారు. 'ప్రస్తుతానికి 11 స్టేడియంలు పరిశీలనలోవున్నాయి. ముంబాయిలో రెండు, జైపూర్, చెన్నై, మొహాలి,ఢిల్లీ, కోల్ కటా, బెంగుళూరు, హైదరాబాద్ లలో ఒక్కొక్కటి ఎంపికయ్యాయి. ఒక ఫ్రాంచైజీ ఇండియాలో లేదా విదేశంలో ఒక స్టేడియం కోసం చూస్తున్నారు. గత సంవత్సరం రన్నర్స్ అప్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు ఈసారి రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం లభించింది. రెండు మ్యాచ్ లు చెన్నైలోనే నిర్వహించాలని ఆ జట్టు నిర్ణయించింది' అని ఆయన చెప్పారు.బిగ్ టివి, సోని ఎంటర్ ప్రైజెస్ ల మధ్య వివాదాన్ని ఐపిఎల్ మంగళవారం పరిష్కరిస్తుందని మోడీ తెలిపారు.
News Posted: 16 February, 2009
|