ధోనీ సేనకు కివీస్ 'టెస్ట్'
న్యూఢిల్లీ:నల్లేరు మీద నడకలా సాగిపోతున్న ధోనీ క్రికెట్ శకటానికి గతుకులుఎదురయ్యే రోజులు దగ్గరపడుతున్నాయి. ఈ నెలాఖరులో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ పర్యటనలో తన క్రికెట్ కెరీర్ లో అత్యంత కఠిన పరీక్షలను అతడు ఎదుర్కోనున్నాడు. అనతి కాలంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న ఈ ఇరవయ్యేడేళ్ల భారత కెప్టెన్ కివీస్ పై తన విజయ పరంపరను కొనసాగించాల్సి వుంది. జార్ఖండ్ లోని రాంచిలో మామూలు రైల్వే ఉద్యోగి స్థాయి నుంచి సెలిబ్రేట్ స్పోర్ట్స్ మన్ స్థాయికెదిగి, ఇది గాలివాటం కాదు కఠోర పరిశ్రమ ఫలితమని నిరూపించుకున్నాడు ఈ డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్. 2004లో అంతర్జాతీయ వన్డే రంగంలో నిరాడంబరంగా అడుగుపెట్టి, 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన ట్వంటీ20 ప్రారంభ వరల్డ్ కప్ పోటీల్లో, సీనియర్ ఆటగాళ్లు తప్పుకోవడంతో, జట్టు సారథ్య బాధ్యతను స్వీకరించాడు. అక్కడ అఖండ విజయం సాధించి, కప్ తో స్వదేశానికి తిరిగి వచ్చి, వన్డే జట్టు కెప్టన్ బాధ్యతలతో పాటు టెస్ట్ జట్టు వైస్ కెప్టన్ బాధ్యతను చేపట్టాడు. కుంబ్లే రిటైర్మెంట్ తరువాత, గత సంవత్సరం అక్టోబర్ లో టెస్ట్ జట్టు కెప్టెన్సీ కూడా ధోనీని వరించింది.
వికెట్ కీపింగ్ తోపాటు జట్టు సారథ్యం అతడికి తలకు మించిన భారమవుతుందన్న విమర్శలను వమ్ముచేస్తూ, కెప్టెన్ గా ఆడిన ఐదు టెస్ట్ లలో నాలుగింటిని గెలుపొంది శభాష్ అనిపించుకున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. అతడి నాయకత్వంలో ఆడిన 46 వన్డే మ్యాచ్ లలో 28, 10 ట్వంటీ ఇంటర్నేషనల్స్ లో 6 భారతజట్టు గెలుపొందడంతో క్రికెట్ అభిమానులకు ఆరాధ్య హీరో అయిపోయాడు. అత్యంత ాకర్షణీయమైన స్పాన్సర్ షిప్ లు అతడిని వరించాయి. 19 బ్రాండ్ లకు రాయబారిగా వున్న ధోనీ, ఐపిఎల్ లీగ్ లో చెన్నై సూపర్ స్టార్స్ జట్టులో యేడాదికి 1.5 మిలియన్ డాలర్ల కాంట్రాక్టుతో అందరికంటె ఎక్కువ పారితోషికం పొందుతున్న భారతీయ క్రికెటర్ గా వెలుగొందుతున్నాడు.
ధోనీ సేన న్యూజిలాండ్ పర్యటన వచ్చే వారం ప్రారంభమవుతుంది. ఇటీవల ఆస్టర్ేలియా, ఇంగ్లండ్ జట్లపై హోం సిరీస్ విజయాలతో, శ్రీలంకలో వన్డే సిరీస్ ఘన విజయంతో ఉత్తేజంగా వున్న ధోనీ జట్టుకు, సొంత గడ్డమీద ఆడే డేనియల్ వెటోరి కివీస్ జట్టు అంత సులభంగా లొంగదన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు. భారతజట్టు న్యూజిలాండ్ లో టెస్ట్ సిరీస్ గెలుచుకుని 41 సంవత్సరాలయింది. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ నాయకత్వంలో భారతజట్టు అప్పడు 3-1 మ్యాచ్ లో తేడాతో సిరీస్ గెలిచింది. క్రితంసారి 2002లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారతజట్టు ఆడిన రెండు టెస్ట్ లలో, బౌలర్లకు పూర్తిగా సహకరించిన పిచ్ లపై, 161,121; 99,154 స్కోర్లతో ఓడిపోయింది. ఆ తరువాత వన్డే సిరీస్ ను కూడా న్యూజిలాండ్ 5-2 తేడాతో గెలుచుకుంది.
ప్రస్తుతం న్యూజిలాండ్ వెళ్తున్న జట్టులో కేవలం ఆరుగురికి మాత్రమే-సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్- గతంలో అక్కడ ఆడిన అనుభవం వుంది. రెండు ట్వంటీ పోటీలు, ఐదు వన్డే ఇంటర్నేషనల్స్, మూడు టెస్ట్ మ్యాచ్ లతో ఊపిరి సలపనివ్వని ఈ షెడ్యూలు భారతజట్టు శక్తి, సహనాలకు నిజంగా అగ్నిపరీక్ష అనడంలో సందేహం ఎంతమాత్రం లేదు. అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడడానికి ఒక్క ప్రాక్టీసు మాత్రమే ఏర్పాటుచేశారు. 'ఇది నిజంగా పెద్ద సవాలే'నని ఇప్పటివరకూ ఆరిసార్లు కివీస్ పర్యటకు వెళ్లిన సచిన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఫిబ్రవరి 20న న్యూజిలాండ్ చేకురోనున్న భారతజట్టు 25న(క్రైస్ట్ చర్చ్), 27న(వెల్లింగ్టన్) ట్వంటీ మ్యాచ్ లు, మార్చి 3 నుంచి 14 వరకు వన్డే మ్యాచ్ లు, మార్చి 18నుంచి హామిల్టన్ లో మొదటి టెస్ట్, 26 నుంచి 30 వరకు నేపియర్ లో రెండో టెస్ట్, ఏప్రిల్ 3 నుంచి 7 వరకు వెల్లింగ్టన్ లో మూడో టెస్ట్ ఆడుతుంది.
News Posted: 17 February, 2009
|