సీమర్లకు శ్రీనాథ్ చిట్కాలు
చెన్నై: బ్యాట్స్ మన్ ప్రతి బంతిని ముందడుగు వేసి షాట్ కొట్టేలా బౌలింగ్ చేయాలని భారతజట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ న్యూజిలాండ్ వెళ్తున్న జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ తదితర బౌలర్లకు సలహా ఇచ్చాడు. అతివేగంగా బంతులు వేసి బ్యాట్ ను బీట్ చేయాలన్న ఆలోచనతో కాకుండా, ప్రత్యర్ధి అన్ని బంతులనూ ఆడేలా బౌల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవాలని శ్రీనాథ్ చెప్పాడు. 'ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, పేస్ బౌలింగులో ప్రాథమిక సూత్రాలలో ఎన్నడూ ఎటువంటి మార్పు ఉండదు. సరైన చోట, సరైన దూరంలో పడేలా బంతి వేయడం, ముఖ్యంగా బ్యాట్స్ మన్ మిస్ అయితే వికెట్ కీపర్ కు అందేలా వేయడం, ప్రతి బంతి బ్యాట్స్ మన్ ముందుకు వచ్చి షాట్ కొట్టేలా వేయడం అలవాటు చేసుకోవాలి. బ్యాట్స్ మన్ ప్రతి బంతికి ఫ్రంట్ ఫుట్ వేస్తే అతడిని ఔట్ చేయడం కష్టంకాద'ని శ్రీనాథ్ అన్నాడు.
ఇన్నింగ్స్ ప్రారంభంలోనే వికెట్ పడగొట్టగలిగినప్పుడు అదే ఊపులో బౌలింగ్ కొనసాగించాలని శ్రీనాథ్ చెప్పాడు. 'వాతావరణం, పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలిస్తున్నప్పుడు, బౌలర్ పాత్ర అత్యంత కీలకమైనది. బ్యాట్స్ మన్ ను సెటిల్ కానివ్వకూడదు. ఒక్కోసారి వరుసగా వికెట్లు పడుతున్నప్పుడు, ప్రత్యర్ధులను 150 లేదా 200 పరుగులకే ఆలౌట్ చేయొచ్చు. న్యూజిలాండ్ లో పిచ్ లు అటువంటివే' అని శ్రీనాథ్ వివరించాడు. మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో మూడో సీమ్ బౌలర్(లక్ష్మీపతి బాలాజీ కావచ్చు, ధవల్ కులకర్ణి కావచ్చు, మునాఫ్ పటేల్ కావచ్చు)పాత్ర ముఖ్యమైనదన్నాడు. ఓపెనింగ్ బౌలర్లు జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ సాధించిన ఫలితాల్లో మూడో సీమర్ కనీసం 80 శాతం సాధించగలిగినా, వాళ్లిద్దరికీ మధ్యలో తగిన విశ్రాంతి లభిస్తుందని, తక్కువ స్పెల్స్ వేస్తూ బ్యాట్స్ మెన్ ను కట్టడిచేయడం సాధ్యమవుతుందని శ్రీనాథ్ అన్నాడు.
మూడో సీమర్ గా ఎవరిని ఎంపికచేయాలన్నది కెప్టెన్, మేనేజర్ ల అంచనాల మీద ఆధారపడి వుంటుందని, కాకపోతే ఆ బౌలర్ మూడు టెస్ట్ మ్యాచ్ లలో ఆడాలని, మ్యాచ్ మ్యాచ్ కీ మూడో బౌలర్ ను మార్చడం వల్ల ప్రధాన బౌలర్లకు ప్రయోజనం వుండదని శ్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. 'బాలాజీకి మళ్లీ ఆడే అవకాశం లభించింది. ధవల్ కులకర్ణి రంజీలో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా ఎంపికయ్యాడు. మూడో సీమర్ గా స్థిరపడే అవకాశాలు వాళ్లిద్దరికీ బాగా వున్నాయి. గాయాల సమస్య లేకపోతే మునాఫ్ పటేల్ ప్రధాన బౌలర్ గానే కొనసాగేవాడు. నిలకడగా రాణించడంలో మునాఫ్ దిట్ట' అని శ్రీనాథ్ వ్యాఖ్యానించాడు. మందకొడి పిచ్ ల మీదకూడా మంచి ఫలితాలు రాబట్టిన మన పేస్ బౌలర్లు న్యూజిలాండ్ పిచ్ లమీద విజృంభించే అవకాశాలు ఎక్కువనీ, ఇంగ్లండ్ లో మాదిరిగా న్యూజిలాండ్ లో వాతావరణం బాగా చల్లగా, తేమగా వుంటుందని, ఇండియాలో శీతాకాలం మాదిరిగా వుటుందని ఒక ప్రశ్నకు శ్రీకాంత్ బదులిచ్చాడు.
News Posted: 18 February, 2009
|