కివీసే బహుపరాక్!
వెల్లింగ్టన్: భారత పేస్ బౌలర్లు న్యూజిలాండ్ బౌలర్లకంటె ఉత్తమంగానే వున్నారని, సీమ్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ లమీద మునుపటి వ్యూహాలనే అనుసరిస్తే బెడిసికొడతాయని మాజీ కెప్టెన్ జాన్ రైట్ కివీస్ క్రికెట్ జట్టును హెచ్చరించాడు. 'ఈ సారి ఇక్కడ మనం ఎటువంటి పిస్ లు తయారుచేసినా భారత బౌలర్లు మన వ్యూహాలను తలకిందులు చేయగల సత్తా వున్న వారు. ఒకర్ని మించిన నేర్పుగలవారు ఇంకొకరు. అందరూ ఒకేసారి రాణించినా ఆశ్చర్యపడనవసరం లేదు. అందుచేత పిచ్ లు పేస్ బౌలర్లకు అనుకూలించని విధంగా వుంటేనే మంచిదని అనుకుంటున్నాను'అని రైట్ అభిప్రాయపడ్డాడు. 2002-03లో జరిగిన దానికి భారతజట్టు ప్రతీకారం తీర్చుకోడానికే వస్తున్నట్టుందని వ్యాఖ్యానించాడు.
ముఖ్యంగా ఇషాంత్ శర్మను రైట్ బాగా పొగిడాడు. అనుకూలమైన పరిస్థితుల్లో చావుదెబ్బ తీయగల సత్తా వున్న బౌలర్ అని ప్రశంసించాడు. పేస్ బౌలర్లు ఎక్కువగా కష్టపడే భారత ఉపఖండంలోను, ఆస్ట్రేలియాలోను ఇషాంత్ బౌలింగ్ ను చూశామని, అదే న్యూజిలాండ్, ఇంగ్లండ్ లలో అయితే అతడిని ఎదుర్కోవడం అఁత సులభం కాదని రైట్ చెప్పాడు. పటిష్టమైన బ్యాటింగ్, అత్యంత ప్రమాదకరమైన బౌలర్లు భారతజట్టును ఉన్నతస్థాయికి చేర్చాయని అంటూ పూర్వపు భారతజట్టుకు, ఇప్పటి జట్టుకు పెద్ద తేడా అదేనని, ప్రస్తుత బౌలర్లలో పేస్, స్వింగ్, స్పిన్, లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ బౌలింగ్ లో అందెవేసిన చేతులని రైట్ అభివర్ణించాడు.
'నేను ఇండియాలో ఉన్నప్పుడే ఆ క్రికెట్ జట్టు బలమైన శక్తిగా రూపొందడం ప్రారంభమయింది. ఇప్పడు వాళ్లకి తిరుగు లేదు. అప్పట్లో అద్భుతమైన బ్యాట్స్ మెన్ ఉండేవారు. ఇప్పుడు బ్యాటింగ్ మరింతగా బలపడడంతోపాటు బౌలింగ్ లో మరింతగా రాణించి అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉత్తమ బౌలర్లుగా వాళ్లను పరిగణించవచ్చు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే, లక్ష్మణ్, సెహ్వాగ్, ద్రావిడ్, గంభీర్, ధోని వంటి బ్యాట్స్ మెన్ గల ఏ జట్టయినా భారీ స్కోర్లను సాదించగలదనడంలో ఎటువంటి సందేహం లేదు' అని రైట్ చెప్పాడు.
News Posted: 18 February, 2009
|