విశాఖలో ఐపిఎల్ మ్యాచ్ లు
ముంబై: విశాఖపట్టణంలోని క్రికెట్ అభిమానాలకు శుభవార్త. ఏప్రిల్ లో ప్రారంభం కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) చాంపియన్ షిప్ పోటీలలో భాగంగా రెండు మ్యాచ్ లను విశాఖపట్నంలో నిర్వహించాలని ఐపిఎల్ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాస్తవానికి ఐపిఎల్ మ్యాచ్ లన్నీ హైదరాబాద్ లోనే జరగాల్సి ఉంది. అయితే ఐపిఎల్ టోర్నమెంట్ జరిగే రోజులలలోనే సార్వత్రిక ఎన్నికల జరగనున్నందున హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం ఎన్నికల అవసరాల కోసం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోకి వెళ్ళబోతోంది. ఏప్రిల్, మే మాసాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ఎన్నికల నిర్వహణకు అవసరమైనందున రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంను ఎన్నికల సంఘం రిజర్వ్ చేసుకుంది. దీని వలన ఇదే సమయంలో హైదరాబాద్ లో జరగాల్సిన ఐపిఎల్ మ్యాచ్ లను విశాఖపట్నంకు తరలించాలని ఐపిఎల్ నిర్ణయించింది.
హైదరాబాద్ లో మొత్తం ఏడు ఐపిఎల్ మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఇందులో రెండు మ్యాచ్ లను విశాఖలో నిర్వహిస్తారు. విశాఖపట్నంలోని మధురవాడ సమీపంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఎసిఎ), విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (విడిసిఎ) కలసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్ లు జరుగుతాయి. విశాఖపట్నం స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ ల నిర్వహణకు అర్హత సంపాదించేదుకు ఇటీవలే ఫ్లడ్ లైట్ల సౌకర్యం కల్పించారు. ఫ్లడ్ లైట్ల ఏర్పాటు, టెస్ట్ మ్యాచ్ ల నిర్వహణకు అవసరమైన సౌకర్యాల కల్పన అనంతంర ఐసిసికి చెందిన నిపుణుల కమిణీ ఈ స్టేడియంను సందర్శించి అక్కడ కల్పించిన వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ విశాఖ స్టేడియంకు టెస్ట్ మ్యాచ్ లను నిర్వహించే అర్హతను కల్పించింది.
డే - నైట్ జరిగే ఐపిఎల్ మ్యాచ్ లు నిర్వహణకు అవసరమైన ఫ్లడ్ లైటింగ్ సిస్టమ్ తోపాటు, ప్లేయర్లకు, అతిధులకు, మీడియాకు, ప్రేక్షకులకు అవసరమైన సకల సౌకర్యాలు ఉన్నందున ఐపిఎల్ బోర్డు విశాఖపట్నంను ఎంపిక చేసినట్లు తెలిసింది. విశాఖలో నిర్వహించే రెండు మ్యచ్ లలో ఒకటి డక్కన్ చార్జర్స్, కోల్ కత్తా నైట్ రైడర్స జట్ల మధ్య మరొకటి డక్కన్ చార్జర్స్, బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య జరగబోతున్నట్లు తెలిసింది.
News Posted: 22 February, 2009
|