పిచ్ ల గురించి వర్రీ లేదు
క్రైస్ట్ చర్చ్: న్యూజిలాండ్ లోని సీమింగ్ పిచ్ లు బారత క్రికెట్ కోచ్ గారీ కిరిస్టెన్ కు ఎటువంటి ఆందోళన కలిగించడం లేదు. ఈ పర్టటనలో ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని, మొత్తం 47 రోజుల పర్యటనలో ఎదురు కానున్న సమస్యలకు ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకున్నామని, అనుకున్నవి అనుకున్నట్టుగా ఆచరించడంపైనే అంతా ఆధారపడి వుంటుందని అన్నాడు. 'ప్రపంచంలో అన్ని వికెట్ల స్వభావం వేర్వేరుగా ఉంటుంది. ఏ రెండు పిచ్ లు ఒక్కలా ఉండవు.అందువల్ల మేము వికెట్ల మీద దృష్టి పెట్టడం లేదు. భారత జట్టు మంచి సమతూకంగా ఉంది. ముఖ్యంగా పేస్ బౌలర్లు గత సంవత్సరం అద్భుతంగా రాణించారు. ప్రతి చోట పిచ్ ల గురించే అందరూ మాట్లాడుతున్నారు. కాని వెస్టిండీస్ లో నేను చూసిన పిచ్ లు ఆటగాళ్లకు బాగా అనుకూలించాయి. అయినా పిచ్ ల గురించి అంతగా భయపడనవసరం లేదు'అని భారత కోచ్ వ్యాఖ్యానించాడు.
క్రితంసారి 2002-03లో న్యూజిలాండ్ లో పర్యటించిన భారతజట్టు వైఫల్యాల గురించి కిర్ స్టెన్ మాట్లాడుతూ,'అదెప్పుడో ఆరేడేళ్ల కిందటి మాట. గతాన్ని స్మరించుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు మీదనే మా దృష్టి వుంది. గతం గురించి జట్టు సమావేశాల్లో కూడా ప్రస్తావించడం లేదు. పరిస్థితులకు అనుగుణమైన వ్యూఙాన్ని రూపొందించు కోవడం. దాన్ని ఖచ్చితంగా అనుసరించడం ద్వారానే భారత జట్టు ప్రమాణాలు మెరుగయ్యాయి. భారత జట్టు గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఆడిన 17 క్రికెట్ మ్యాచ్ లలో ఒక్కటి మాత్రమే ఓడిపోయింది. అందువల్ల ప్రణాళికా బద్ధంగా ఆడితే విజయావకాశాలు ఎప్పుడూ వెన్నంటే ఉంటాయి' అని చెప్పాడు.
అయితే కివీస్ తో క్రికెట్ పోరాటం కష్టంగానే ఉంటుందని, ఆ జట్టును తేలిగ్గా అంచనా వేసే ప్రసక్తి లేదని, సొంత గడ్డ మీద వాళ్లని ఓడించడం అంత సులభం కాదని కిర్ స్టెన్ అభిప్రాయపడ్డాడు. కివీస్ బలమైన ప్రత్యర్ధులనీ, ప్రతి పోటీకీ సర్వ సన్నద్ధంగా ఉంటారనీ చెప్పాడు. శనివారం నాలుగున్నర గంటలు, ఆదివారం నాలుగు గంటలు ప్రాక్టీసు చేశామని, సీనియర్లు కూడా ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు ఇస్తున్నారని, కివీస్ పర్యటన నల్లేరు మీద నడక కాకపోయినా, ఒక జట్టుగా సాధించాల్సిన అంశాలమీ దృష్టి కేంద్రీకరిస్తున్నామని కిర్ స్టెన్ వివరించాడు.
News Posted: 23 February, 2009
|