ఎప్పటికప్పుడే ఫ్రెష్:ధోని
క్రైస్ట్ చర్చ్: అతడి సారథ్యంలో భారత క్రికెట్ జట్టు ఎన్నడూ తప్పటడుగులు వేయలేదు కాని, గతం సాధించిన విజయాలను అడ్డుపెట్టుకుని మాట్లాడే రకం కాదు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. బుధవారం న్యూజిలాండ్ జట్టుతో ఇక్కడ జరిగే మొదటి ట్వంటీ20 మ్యాచ్ లో తమ కెరీర్ ప్రారంభిస్తున్నంత జాగ్రత్తగా ఆడతామని, ప్రతి పోటీని తాను మొదటి మ్యాచ్ గానే పరిగణిస్తానని ధోని అన్నాడు. ఈ రకం పోటీల్లో ప్రపంచ చాంపియన్ అయిన ధోని సేన, ఆటగాళ్లను బట్టి చూస్తే కివీస్ కంటె బలమైన జట్టుగానే కనిపిస్తుంది. అయినప్పటికీ, కేవలం పేపర్ టైగర్లు అనిపించుకునే పరిస్థితి ఉండదని, ప్రతి పోటీని తాజాగా ఆడుతున్నట్టుగానే తాము భావిస్తామని స్పష్టం చేశాడు.
బుధవారం జరిగే మ్యాచ్ మిగతా సిరీస్ కు మార్గదర్శకం కాదని, మొదటి మ్యాచ్ గెలిస్తే మిగతా సిరీస్ మీద దాని ప్రభావం ఉంటుందని భావించడానికి వీల్లేదని భారత కెప్టెన్ చెప్పాడు. 'ఈ 50 రోజుల పర్యటనలో దాదాపు అన్ని పోటీల్లో నిలకడగా, నిబ్బరంగా ఆడే జట్టే విజేత కాగలదు. భారత జట్టులో మ్యాచ్ విన్నర్లు లేకపోలేదు. కాని ప్రతి ఒక్కరూ విధిగా కష్టపడాలి. విజయానికి తనవంతు కృషి చేయాలి. ఏ ఒకరిద్దరి వల్లనో కాకుండా సమిష్టిగా జట్టు విజయానికి పాటుపడాలి' అని చెప్పాడు
News Posted: 24 February, 2009
|