చకింగ్'కు కొత్త సెన్సర్
దుబాయ్: బౌలర్లు సక్రమమైన యాక్షన్ తో బంతులు వేయడంలేదని అనుమానం వస్తే పట్టుకోడానికి కొత్త సెన్సర్ లు వచ్చేస్తున్నాయి. ప్రత్యేకించి ఒక బౌలర్ బంతిని విసిరేస్తున్నాడని అంపైర్లు సందేహపడితే ఆ బౌలర్ ఈ కొత్త సెన్సర్ ధరిస్తే చాలు. 'చకింగ్'గా వ్యవహరించే అక్రమమైన బౌలింగ్ ను అరికట్టడానికి ఇంతవరకూ ఎన్నో పద్ధతులను అమలు పరిచారు. క్రీడా మైదానంతో పని లేకుండా, లేబొరేటరీ వాతావరణంలో ఇంతవరకూ అనుమానాస్పద బౌలర్ల యాక్షన్ ను పరీక్షిస్తు వస్తున్నారు. ఇప్పడు తాజాగా మ్యాచ్ పరిస్థితుల్లో ఆ బౌలర్లను పరీక్షించడానికి సెన్సర్లు తయారయ్యాయి. ఈ పద్ధతిని ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో గల గ్రిఫిత్ యూనివర్సిటీ అధ్యయనం చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) నిధులు సమకూరుస్తోంది. ఈ అధ్యయనంలో, బౌలర్లు సెన్సర్ ను ధరించి బంతులు వేస్తారు. బంతి వేసే సమయంలో వారి యాక్షన్ ను సెన్సర్ రికార్డు చేసి అది సక్రమమో, అక్రమమో నిర్ధారిస్తుంది.
ప్రస్తుతం అమలులో వున్న నిబంధనల ప్రకారం, బౌలర్లు బంతి వేసే సమయంలో మోచేయిని 15 డిగ్రీల కోణం వరకూ వంచ వచ్చు. అంతకు మించి చేయి వంగితే అది ఇల్లీగల్(నిబంధనలకు విరుద్ధమైన)డెలివరీ అవుతుంది. అంటే బౌలర్ బంతిని విసిరేశాడన్న మాట. ఐసిసి జనరల్ మేనేజర్ డేవిడ్ రిచర్డ్ సన్ ఈ అధ్యయనం గురించి ప్రకటిస్తూ కొత్త సెన్నసర్ బౌలర్ యాక్షన్ లో మోచేతి వంపును అప్పటికప్పుడే కొలిచేస్తుందని చెప్పాడు. లేబొరేటరీ పరిస్థితుల్లో అయితే అదే డెలివరీని మళ్లీ రెండోసారి చూడడం సాధ్యం కాదని, అంతే కాకుండా లేబ్ లో అయితే బౌలర్ అనుకోకుండానో, కావాలనో తన యాక్షన్ ను మార్చే అవకాశం ఉంటుదని, అదే మ్యాచ్ జరుగుతున్నప్పుడు సెన్సర్ ను అసలు రంగు బయటపడుతుందని రిచర్డ్ సన్ అన్నాడు.
News Posted: 25 February, 2009
|