రహ్మాన్ కు నో రిహర్సల్
ముంబాయి: డబుల్ ఆస్కార్ విన్నర్ ఎఆర్ రహ్మాన్ క్రికెట్ వీరాభిమాని. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసీసీఐ)గత డిసెంబర్ లో నిర్వహించ తలపెట్టి, నవంబర్ ముంబాయి దాడుల కారణంగా వాయిదా వేసిన ట్వంటీ20 చాంపియన్స్ లీగ్ కు రహ్మాన్ థీమ్ సాంగ్ ను స్వరపరిచాడు. ఇది చెన్నైలోని అతడి స్టూడియోలో రికార్డయింది. అప్పటినుంచి ఈ సంగీత స్రష్ట క్రికెట్ ఇన్నింగ్స్ ప్రారంభమయింది. అప్పట్లో ఆ లీగ్ పోటీల టెలివిజన్ హక్కులు కొనుక్కున్న ఇఎస్పియన్ చానెల్ యజమాన్యం, నవంబర్ మధ్యలో పాట రికార్డింగ్ అవుతున్నప్పుడు తీవ్ర ఉద్వేగానికి లోనయింది. క్రికెట్ కోసం, ఆ మాటకు వస్తే ఆటల కోసం సంగీతం సమకూర్చడం అదే మొదటి సారి కావడంతో రహ్మాన్ కూడా ఆవేశపూరితుడయ్యాడని చానెల్ మార్కెటింగ్ విభాగం సీనియర్ డైరక్టర్ నిర్మల్ దయాని చెప్పారు.
సంగీత ప్రపంచానికి రహ్మాన్ ఎంత విలువైనవాడో, చాంపియన్స్ లీగ్ టి20 క్రికెట్ రంగానికి అంత గొప్పదని ఇఎస్పీయన్ చానెల్ అతడికి బోధపరిచింది. అలాగే రహ్మాన్ కూడా అనుకున్నది సాదించడానికి చాలా ప్రయోగాలు చేయవలసి వచ్చింది. చివరకు పాట లేకుండానే, అద్భుతమైన ట్యూన్ కట్టి యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. అది కూడా రిహార్సల్స్ లేవు, రీ టేకులు లేవు. 'ట్రాక్ లో ట్యూన్ విన్న తరువాత, వీలైనప్పుడు దానికి పియానో బాణీ కట్టమన్నాను. ఆయన పియానో దగ్గర కూర్చుని ట్రాక్ వాయించాడు. అంతే! కేవలం ఒకే ఒక్కసారిలో బాణీ కట్టడం, రికార్డింగు చేయడం నా కళ్లెదుటే జరిగిపోయింది. ప్రస్తుతం కేవలం టేపులకే పరిమితమైన ఆ సంగీతం వచ్చే అక్టోబర్ లో జరిగే చాంపియన్ టి20 టోర్నమెంట్ లో మారుమోగిపోతుంది' అని దయాని అన్నారు.
News Posted: 25 February, 2009
|