చెత్త బ్యాటింగే...
క్రైస్ట్ చర్చ్: బాధ్యతారహితమైన బ్యాటింగే వల్లే బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన తొలి ట్వంటీ మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని అన్నాడు. ఇంతవరకూ ఆడిన 12 ట్వంటీ20 పోటీల్లో మూడో ఓటమిని చవి చూసిన ధోని, మన బ్యాట్స్ మెన్ ఎటువంటి వ్యూహం లేకుండా దూకుడుగా ఆడినందు వల్లనే ఇన్నింగ్స్ ప్రారంభంలో వరసగా వికెట్లు పడిపోయాయన్నాడు. 'బరిలో దిగిన దాదాపు అందరు బ్యాట్స్ మెన్ బాగానే ఆడారు. కాని అదే ఊపులో అర్ధంపర్ధం లేని షాట్లు కొట్టి ప్రత్యర్ధికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించ లేకపోయారు' అని ధోని సహచరులపై మండిపడ్డాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ మంచి స్కోరు సాధించారని కనీసం ఒక్కరైనా గ్రహించి క్రీజులో పాతుకుపోడానికి ప్రయత్నించి వుంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నాడు. మొత్తం ఇరవై ఓవర్లూ బ్యాటింగ్ చేసినా ఏ ఒక్క జట్టు 200 పరుగులు ముంచి సాధించలేక పోయిన విషయాన్ని క్రితం సారి ఐపిఎల్ టోర్నమంట్ లోను, ఇతర ట్వంటీ పోటీల్లోను అందరూ చూశారని, అయినా మనవాళ్లు అంత పెద్ద స్కోరు సాధించేద్దామని అనంవసరంగా తాపత్రయపడి 160తో సరిపెట్టుకోవలసి వచ్చిందని ధోని అన్నాడు.
న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ఆడిన తీరును ధోని మెచ్చుకున్నాడు. 'మనంత వేగంగా కాకపోయినా వాళ్ల టాప్ ఆర్డర్ కూడా బాగా ఆడారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్వంటీ పోటీల్లో చివరి ఓవర్లు వచ్చే సరికి చేతిలో వికెట్లు ఉండాలి. వాళ్లు అలాగే ఆడారు.
చివరి ఐదు ఓవర్ల సమయానికి ఇంకా ఐదు వికెట్లు ఉంటే మనదే పైచేయి అవుతుంది' అన్నాడు ధోని. మరో సీమ్ బౌలర్ లేని లోటు కనిపించిందా అన్న ప్రశ్నకు, ఎప్పడూ ఆడే కాంబినేషన్ తోనే నిన్న కూడా దిగామని, స్పిన్నర్ కి బదులు పేస్ బౌలర్ ను తీసుకంటే బ్యాటింగ్ బలం తగ్గిపోతుందని చెప్పాడు. అలాగే భారత బౌలర్ల ఆటతీరుపట్లకూడా ధోని సంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా చాలా రోజుల తరువాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టిన హర్భజన్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడని, యార్కర్ ను తెలివిగా ఉపయోగించాడని, అలాగే జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ఎకనామికల్ గా బౌల్ చేశారని భారత కెప్టెన్ ప్రశంసించాడు. భారత బ్యాట్స్ మెన్ ను 162 పరగులకే పరిమితం చేసిన కివీస్ బౌలర్లను కెప్టెన్ డానియెల్ వెట్టోరి మెచ్చుకున్నాడు. అలాగే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ బ్రెండన్ మెకల్లమ్ ను కూడా ప్రశంసించాడు. ఓ వైపు మెకల్లమ్ క్రీజును అంటిపెట్టుకుపోయి స్కోరును పరుగులు తీయిస్తుండగా, మార్టిన్ గుప్టిల్, రాస్ డేనయల్, జాకబ్ ఓరమ్ అతడికి బాగా సహకరించారని కివీస్ కెప్టెన్ చెప్పాడు.
News Posted: 26 February, 2009
|