కోర్టుకెళ్తాం:కపిల్
ముంబాయి: గుర్తింపు కోసం తాజాగా చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసిఎల్) ఆలోచిస్తోంది. ఐసిఎల్ కు అధికార గుర్తింపు ఇచ్చే ప్రతిపాదనను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని భారత జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చెప్పాడు. జోహాన్స్ బెర్గ్ లో గత సోమవారం జరిగిన చర్చలు విఫలంకావడంతో, ఐసిఎల్, బీసీసీఐ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యత్నాలు బెడిసికొట్టాయి. 'ఆటలకు సంబంధించిన వివాదాలు కోర్టులో పరిష్కారం కావడం ఒక క్రీడాకారుడిగా నాకిష్టం లేదు. కాని ఇప్పడు చర్చలు మళ్లీ విఫలమైనందు వల్ల, చట్టపరమైన చర్య తీసుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు'అని ఐసిఎల్ చైర్మన్ అయిన కపిల్ దేవ్ చెప్పాడు.
భారతదేశంలో క్రికెట్ ను ప్రమోట్ చేయడానికి అధికారం, బాధ్యతలు ఎవరు అప్పగించారో తనకు అర్ధం కావడం లేదని, ఐసిఎల్ చేస్తున్నది కూడా అదే పని అని, అటువంటప్పుడు తనవారిని శిక్షించే హక్కు వారికెవరిచ్చారని కపిల్ ప్రశ్నించాడు. బీసీసీఐ ప్రవర్తన న్యాయబద్ధంగా లేదన్నాడు. ఏప్రిల్ లో జరుగనున్న ఐసిసి బోర్డు సమావేశంలో ఐసిఎల్ దరఖాస్తుపై తదుపరి చర్చ జరుగుతుంది. 2007లో భారత జట్టు తొలి ట్వంటీ వరల్డ్ కప్ ను సాధించిన తరువాత దేశంలోని అతి పెద్ద మీడియా సంస్థ ఆర్ధిక సాయంతో ఐసిఎల్ ఆవిర్భవించింది. ఈ లీగ్ లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లను, ముఖ్యంగా పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఆటగాళ్లతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. అయితే ఐసిఎల్ పోటీల వల్ల తన హోదా, స్థాయి తగ్గిపోతాయని భావించిన బిసిసిఐ, ఆ లీగ్ కు గుర్తింపు ఇవ్వడానికి తిరస్కరిచడమే కాకుండా దానితో ఒప్పందం కుదుర్చుకున్న ఆటగాళ్లను సంబంధిత దేశాల క్రికెట్ బోర్డులు బహిష్కరించేలా ఒప్పించింది.
News Posted: 26 February, 2009
|