ఓటమి స్వయంకృతమే
వెల్లింగ్టన్: భారత క్రికెట్ జట్టుకు న్యూజిలాండ్ లో మొదటివారం నిరాశగానే గడిచింది. ఆడిన రెండు ట్వంటీ మ్యాచ్ లలో పరాజయం పాలయింది. నిజం చెప్పాలంటే ఈ ఓటమి స్వయంకృతమే. అలాగని కివీస్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. చక్కగా ఆడి విజయం చేజిక్కించుకున్నారు. ఈ రకం ఆటలో ప్రపంచ చాంపియన్ అయిన ధోని సేన వ్యూహరచనలో ఫెయిలయింది. ఈ మ్యాచ్ లకు ముందు భారతజట్టుకు తగినంత ప్రాక్టీసు లేదని ఇట్టే అర్ధమవుతుంది. దీన్ని సీరియస్ గా తీసుకోవలసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. భారత జట్టు ప్రపంచంలోనే ఉత్తమమైన జట్టు అని న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెట్టోరి పొగిడి, వారి మీద మరింత ఒత్తిడి సృష్టించాడు. దీనికి తోడు మితిమీరిన ఆత్మ విశ్వాసం, దూకుడుతనం కొంప ముంచాయి. బ్యాటింగులో గొప్ప జట్టే అయినా అవసరమైనప్పుడు వ్యూహాత్మకంగా ఆడలేకపోయారు.
ఎప్పటికప్పుడు మనదే పై చేయి అనిపించుకోవాలనుకుని సిక్సర్లతో స్కోరు పెంచుకోవాలన్న ఆలోచనతో వికెట్లు కోల్పోయింది ధోని జట్టు. ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఆడారు కివీస్. ట్వంటీ పోటీల్లో కూడా క్రీజును అంటిపెట్టుకుని వికెట్ ను కాపాడుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయని నిరూపించాడు బ్రెండన్ మెకల్లమ్. అలాగే వెట్టోరి బౌలింగు, ఫీల్డింగు వ్యూహాలు అద్భుతం. ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా కోలుకోవడం సాధ్యం కాని ట్వంటీ క్రికెట్ పోటీల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకో గలిగితే ఇకపై జరిగే పోటీల్లో విజయం సాధించ గలిగే అవకాశాలు లేకపోలేదు భారత జట్టుకు.
News Posted: 1 March, 2009
|