ఆర్సీఎలో మోడీకి చుక్కెదురు
జైపూర్: రాజస్థాన్ ప్రభుత్వ సహాయం, మోడీ వ్యతిరేక పవనాలు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)వ్యవస్థాపకుడు లలిత్ మోడీని ఖంగు తినిపించాయి. ఆదివారం జరిగిన ఎన్నికలో ఐఎఎస్ అధికారి సంజయ్ దీక్షిత్ ఏడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా, 32 జిల్లా విభాగాల ప్రతినిధులు 11 నుంచి ఒంటిగంట వరకు ఓట్లు వేశారు. దీక్షిత్ కు 19, మోడీకి 12 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికను పెద్ద సవాలుగా స్వీకరించామని, తన అభ్యర్ధిత్వాన్ని సమర్ధించిన రాజస్థాన్ ప్రజలకు ఎంతగానో రుణపడి ఉంటానని ఫలితం వెలువడిన వెంటనే దీక్షిత్ చెప్పారు.
'మోడీ హయాంలో జరిగిన అవినీతి కార్యకలాపాలను బయటపెట్టడానికి ఇంది తొలి అడుగు. నాపై చూపిన అభిమానానికి అసోసియేషన్ సభ్యులకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ నా కృతజ్ఞతలు' అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో లలిత్ మోడీతో పాటు ఇతర పదవులకు పోటీ చేసిన ఆయన అనుయాయులు అందరూ చిత్తుగా ఓడిపోయారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ) ఉపాధ్యక్షుడు కూడా అయిన మోడీకి ఇటీవలి కాలంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత సంవత్సరం ఐపిఎల్ పోటీలు జరుగుతున్నప్పుడు జైపూర్ పేలుళ్ల బాధితులకు ఆరు కోట్ల రూపాయల నిధుల పంపిణీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణతో ఆయనపై కిందటి నెలలో ఎఫ్.ఐ.ఆర్ దాఖలయింది
News Posted: 1 March, 2009
|