ఐపిఎల్ షెడ్యూల్ మార్పు
కోల్ కటా: లోక్ సభ ఎన్నకల రోజులలో జరగవలసి వున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)మ్యాచ్ ల తేదీలను మార్చనున్నట్టు ఐపిఎల్ టోర్నమెంట్ కమిటీ తెలియజేసింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రకటించిన తరువాత, కోల్ కటా నైట్ రైడర్స్, బెగుళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ జరిగే రోజునే(మే 13) కోల్ కటా నగరంలో పోలింగు జరుగుతుందని గుర్తించారు. దీంతో 'టోర్నమెంట్ లోని కొన్ని మ్యాచ్ ల తేదీలను మార్చక తప్పద'ని టోర్నమెంట్ కమిటీ డైరక్టర్ ధీరజ్ మల్హోత్రా అన్నారు. ఈ పరిస్థితి ఒక్క కోల్ కటాలోనే కాకుండా మరికొన్ని నగరాల్లో కూడా ఎదురుకానున్నదని, వాటి వివరాలు పూర్తిగా సేకరించి, ఒకటి రెండు రోజుల్లో కొత్త తేదీలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. నైట్ రైడర్స్ పాల్గొనే మొత్తం లీగ్ మ్యాచ్ లను ఈడెన్ గార్డెన్స్ లోనే నిర్వహిస్తారు. తొలిమ్యాచ్ డక్కన్ ఛార్జర్స్ తో ఏప్రిల్ 11న జరుగుతుంది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఎన్నికల తేదీల ప్రకటనకు స్పందిస్తూ మ్యాచ్ ల రీ షెడ్యూలింగ్ కష్టమైన పనేమీ కాదని, టోర్నమెంట్ కమిటీ ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొంటుందని చెప్పారు
News Posted: 3 March, 2009
|