పాక్ లో వరల్డ్ కప్ లేనట్టే
లండన్: భద్రతా ఏర్పాట్లను గణనీయంగా మెరుగుపరచుకోకుంటే పాకిస్తాన్ లో అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరిగే అవకాశాలు లేవని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) అధ్యక్షుడు డేవిడ్ మోర్గన్ స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాకిస్తాన్ అత్యంత ప్రమాదకరమైన దేశంగా స్పష్టమవుతోందని, మంగళవారం లాహోర్ లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడుల అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. 'అంతర్జాతీయ పోటీ ఒక్కటైనా అక్కడ జరగాలంటే పరిస్థితులు పూర్తిగా మారాలి. నా అభిప్రాయంలో అధికార యంత్రాంగం మారాలి' అని ఒక ఇంటర్వ్యూలో మోర్గన్ చెప్పారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును రద్దుచేయాలని పాకిస్తానీ సెనేటర్లు ఇటీవల ఇచ్చిన పిలుపు బహుశా మోర్గన్ అభిప్రాయానికి కారణం కావచ్చని ఐసిసి ప్రతినిధి ఒకరు చెప్పారు.
పాకిస్తాన్ లో ప్రస్తుత పరిస్థితిని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ తో చర్చించానని, వచ్చే వారం మళ్లీ కలుద్దామని నిర్ణయించామని ఐసిసి ఉపాధ్యక్షుడు, 2011 ప్రపంచ కప్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ శరద్ పవార్ చెప్పారు. టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో అక్కడ మ్యాచ్ లు నిర్వహించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. అయితే పాకిస్తాన్ లో అంతర్జాతీయ క్రికెట్ యుగం ముసిందని ఇంత త్వరగా నిర్ణయించడానికి వీల్లేదని, అంత త్వరగా నిర్ణయాలు తీసుకోవడం తనకు ఇష్టం లేదని బ్రిటన్ లో పాకిస్తాన్ హై కమిషనర్ వజిద్ హసన్ స్కై న్యూస్ టెలివిజన్ తో అన్నారు.
News Posted: 3 March, 2009
|