అసలు లక్ష్యం మేమే:ధోని
నేపియర్: శ్రీలంక క్రికెట్ జట్టుపై మంగలవారం లాహోర్ లో జరిగిన టెర్రరిస్టుల దాడికి అసలు లక్ష్యం భారత జట్టేనని, తమ పాకిస్తాన్ పర్యటన రద్దయినందువల్ల అదృష్టవశాత్తు ప్రమాదం తప్పిందని టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అన్నాడు. పాకిస్తాన్ లో ఇకముందు పర్యటించ దలచుకున్న క్రికెట్ జట్లు చాలా జాగ్రత్తచర్యలు తీసుకోవలసి ఉంటుందని, లంక జట్టుపై దాడిని ఖండిస్తూ ధోని చెప్పాడు. దాడి వార్త విన్న వెంటనే ఎంతో మనక్షోభ కలిగిందని, భారతజట్టు దిగ్భ్రాంతికి గురయిందని చెప్పాడు. మంగళవారం ఇక్కడ వన్డే పాటీ జరుగుతుండగా లాహోర్ దాడి వార్త తెలియగానే కివీస్, భారత జట్లు షాక్ తిన్నాయి. వెంటనే రెండు జట్ల సభ్యులు చేతులకు నల్ల బ్యాండ్ లు ధరించి మ్యాచ్ కొనసాగించారు.
శ్రీలంక జట్టులో తమ స్నేహితులు ఎంతోమంది ఉన్నారని, వారంతా ప్రాణాపాయం లేకుండా బయటపడడం ఆనందం కలిగించిందని న్యూజిలాండ్ కెప్టెన్ డేనియల్ వెట్టోరి అన్నాడు. న్యూజిలాండ్ జట్టు ఐదు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ వెళ్లినప్పుడు తాము బస చేసిన హోటల్ సమీపంలో జరిగిన బాంబు పేలుడు సంఘటనను వెట్టోరి గుర్తు చేసుకున్నాడు. ఇకపై పాకిస్తాన్ కు క్రికెట్ జట్ల పర్యటనలు ఉండకపోవచ్చన్న సందేహాన్ని వ్యక్తం చేశాడు.
News Posted: 3 March, 2009
|