లంకకు ఇమ్రాన్ క్షమాపణ
లాహోర్: 'పాకిస్తాన్ వెళ్ల వద్దని ఎంత పెద్ద ఒత్తిడి వచ్చినా లక్ష్యపెట్టకుండా ఇక్కడకు వచ్చినందుకు శ్రీలంక క్రికెట్ జట్టుకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. శ్రీలంక జట్టు భద్రత కోసం చేసిన ఏర్పాట్లను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆంతరంగిక వ్యవహారాల శాఖ సలహాదారు రెహ్మాన్ మాలిక్ కు చూపించిన దానికంటె అవి పది రెట్లు తక్కువగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ భద్రతా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. ఇందుకు పంజాబ్(పాకిస్తాన్) గవర్నర్ నుంచి పోలీసు అధికారుల వరకూ అందరూ బాధ్యులే. విదేశంలో పర్యటిస్తున్న ఒక అంతర్జాతీయ బృందంపై దుండగులు బహిరంగంగా కాల్పులు ఎలా జరపగలిగారు?'అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సాధారణంగా టెర్రరిస్టు దాడులు పాకిస్తాన్ సైన్యంపైనో, అమెరికా సైన్యంపైనో లేదా నాటో దళాలపైనో ప్రతీకార చర్యలుగా జరుగుతుంటాయని, కాని మంగళవారం లాహోర్ లోజరిగిన దాడి పాకిస్తాన్ ను అస్థిరపరచడానికి ఉద్దేశించినదేనని, ముంబాయి దాడుల వెనుక ఉద్దేశం కూడా ఇదేనని ఇమ్రాన్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారన్నాడు. 2011 వరల్డ్ కప్ భవిష్టత్తు గురించి ఇప్పుడే చెప్పడం కష్టమని ఇమ్రాన్ అన్నాడు.
News Posted: 4 March, 2009
|