ఐపిఎల్ కొత్త షెడ్యూల్
న్యూఢిల్లీ: దేశంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఉనికికే నష్టాన్ని ఎదుర్కొంటున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)ను ఎలాగైనా కాపాడుకోవాలనుకుంటున్న నిర్వాహకులు, సవరించిన షెడ్యూలును గురువారం హోం శాఖకు సమర్పించారు. ఈ టోర్నమెంట్ కు తగిన భద్రత కల్పించే సాధ్యాసాధ్యాలను హోం శాఖ పరిశీలిస్తుంది. లాహోర్ లో మంగళవారం శ్రీలంక జట్టుపై జరిగిన టెర్రరిస్టు దాడి, దేశంలో ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 10న ప్రారంభం కావలసి వున్న ఐపిఎల్ టోర్నమెంట్ అనిశ్చితిలో పడింది. దీంతో వరుసగా అనేక సార్లు సమావేశమైన తరువాత ఐపిఎల్ నిర్వాహకులు, మ్యాచ్ లు జరిగే నగరాల్లో ఎన్నికల పోలింగు తేదీలలో పోటీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ టోర్నమెంట్ షెడ్యూల్ ను సవరించారు. ఆయా నగరాల్లో పోలింగు తేదీకి రెండు రోజుల ముందు, పోలింగు రాజు తరువాత పోటీలు నిర్వహించకుండా షెడ్యూల్ ను మళ్లీ రూపొందించి, హోం శాఖకు అందజేశామని, నిర్ణయం వారిపై ఆధారపడి ఉందని ఐపిఎల్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతానిక ఐపిఎల్ ప్రతినిధులెవరూ హోం శాఖ అధికారులను కలుసుకోవడం లేదు.
'సందేహాలేమైనా ఉంటే, వాటి నివృత్తి కోసం మమ్మల్ని అడిగితే వారిని కలుసుకుంటాం' అని ఐపిఎల్ ప్రతినిధి చెప్పారు. టోర్నమెంట్ నిర్వాహకులతో పాటు ఫ్రాంచైజీలకు భారీ ఎత్తున నష్టాలు వాటిల్లుతాయన్న భయంతో టోర్నమెంట్ ను వాయిదా వేయడానికి సుముఖంగా లేరు. ఎన్నికల సమయంలో టోర్నమెంట్ కు భద్రత కల్పించే విషయమై ప్రభుత్వంతో పాటు భద్రతా సంస్థలు కూడా నిస్సహాయతను వ్యక్తం చేశాయి. ఐపిఎల్ సీజన్ లో ఆటగాళ్లకు కల్పించే భద్రతను అంచనా వేయడంలో తాము విస్తృతమైన పాత్ర నిర్వహించాల్సి ఉందని అంతర్జాతీయ క్రికెటర్ల అసోసియేషన్ల సమాఖ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ మే ఇదివరకే స్పష్టం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడుతున్న న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జాకబ్ ఓరమ్ క్రికెట్ తనకు ప్రాణాల కంటె ఎక్కువ కాదని, భారతదేశానికి వెళ్లాలా వద్దా అనే విషయమై చాలా తీవ్రంగా ఆలోచిచాలని చెప్పాడు. ఒకవేళ ఈ యేడాది ఐపిఎల్ ను వాయిదా వేయాల్సి వస్తే, వచ్చే యేడాది ఇదే సమయంలో కాని దాన్ని నిర్వహించడం సాధ్యం కాదు.
News Posted: 5 March, 2009
|