ముంబైలో తొలి మ్యాచ్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) రెండో సీజన్ ప్రారంభోత్సవం ఏప్రిల్ 10న, తొలుత అనుకున్నట్టుగా జైపూర్ లో కాకుండా, ముంబాయిలో జరుగుతుందని టివి వర్గాల ద్వారా తెలిసింది. ఐపిెల్ నిర్వాహకులు హోం మంత్రిత్వ శాఖకు అందజేసిన సవరించిన షెడ్యూలులో ఈ విషయాన్ని పేర్కొన్నట్టు టివి వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా, తొలి సీజన్(2008)లో మ్యాచ్ లు నిర్వహించిన ఎనిమిది నగరాలతో పాటు మరో ఐదు నగరాలను- నాగపూర్, విశాఖపట్నం, కటక్, రాజ్ కోట్, ఇండోర్- ఈ యేడాది షెడ్యూలులో చేర్చారు.
ఐపిఎల్ భవిష్యత్తుపై చెలరేగుతున్న ఊహాగానాలకు చైర్మన్ లలిత్ మోడి శుక్రవారం ఫుల్ స్టాప్ పెట్టారు. 'ఐపిఎల్ జరిగి తీరుతుంది. పోటీలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని అభిమానులు, స్పాన్సర్లు తదితరులకు హామీ ఇస్తున్నాం. అంతేకాదు ఐపిఎల్ పోటీలు భారతదేశం లోనే జరుగుతాయి.వేరే దేశాలకు తరలించే ప్రయత్నాలేవీ జరగడం లేదు. ఈ విషయమై ఊహాగానాలను పట్టించుకోవద్దు' అని ఆయన స్పష్టం చేశారు. పూర్తిగా సవరించిన కొత్త షెడ్యూలు త్వరలోనే విడుదల అవుతుందని మోడి చెప్పారు. రెండో సీజన్ ప్రారంభ, ముగింపు పోటీల తేదీలలో మార్పు ఉండదని, మధ్యలో జరిగే మ్యాచ్ ల తేదీలను మాత్రమే, ఎన్నికల పోలింగు తేదీలకు అడ్డు కాకుండా, సవరిస్తున్నామని వివరించారు. 'పోలింగు రోజుల్లో మ్యాచ్ లు జరగవు. ఆటగాళ్లు, స్టేడియంల భద్రత కోసం ప్రైవేటు సంస్థలను వినియోగిస్తాం'అని మోడి స్పష్టంగా చెప్పారు.
News Posted: 6 March, 2009
|