భారత్ చేతిలో పాక్ చిత్తు
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఆస్ట్రేలియాలోని బ్రాడ్మన్ ఓవల్ మైదానంలో శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో భారత బౌలర్లు అత్యద్భుత ప్రజ్ఞ కనబరచి తమ ప్రత్యర్థి జట్టు పాకిస్తాన్ ను చిత్తు చేశారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు తమ పొరుగు దేశం జట్టును 57 పరుగులకే ఆలౌట్ చేసింది. భారత జట్టు విజయ లక్ష్యాన్ని ఒక్క వికెట్టూ నష్టపోకుండానే కేవలం 10 ఓవర్లలో సాధించింది. అనఘా దేశ్ పాండే 26 పరుగులు, అంజుమ్ చోప్రా 17 పరుగులు చేసి ఇండియాను గెలిపించారు.
భారత బౌలర్లలో రుమేలీ ధర్ ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకోగా అమితా శర్మ, ప్రియాంక రాయ్ చెరి రెండు వికెట్లు నష్టపరిచారు. కెప్టెన్ ఝులన్ గోస్వామి, గౌహర్ సుల్తానా చెరి ఒక వికెట్ పడగొట్టారు. గత ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ చేరి చివరకు చాంపియన్లు ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత జట్టు ఈ సారి కప్ ను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్నది. ఝులన్ గోస్వామి నాయకత్వంలోని భారత జట్టు ఈ టోర్నీలో గ్రూప్ బిలో ఉంది. ఇంకా ఈ గ్రూపులో రెండు సార్లు చాంపియన్ ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్ ఉన్నాయి. గ్రూప్ ఎ లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి.
News Posted: 7 March, 2009
|