మనోళ్ళు ఉతికి ఆరేశారు!
క్రైస్ట్ చర్చ్: వీరేంద్ర సెహ్వాగ్ కు ఎలా బంతులు వేసి కట్టడి చేయాలా అని సతమతమవుతున్న కివీస్ ను లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్(163 రిటైర్డ్ హర్ట్), యువరాజ్ సింగ్(87) ఆదివారం మూడు చెరువుల నీళ్లు తాగించారు. తన వన్డే కెరీర్ లో 43వ సెంచరీ పూర్తి చేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తో కలసి యువరాజ్ సింగ్ న్యూజిలాండ్ బౌలర్లను చితకబాదడంతో, కీలకమైన ఈ మూడో మ్యాచ్ లో న్యూజిలాండ్ లో అత్యధిక వన్డే స్కోరు(392/4) నమోదయింది. 60 బంతుల్లో 87(10 బౌండరీలు, 6 సిక్సర్లు) పరుగులు చేసిన యువరాజ్ సింగ్ ప్రత్యర్దుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. న్యూజిలాండ్ లో తొలి సెంచరీ సాధించిన టెండుల్కర్ కు ఇది అతడి వన్డే కెరీర్ లో అత్యధిక ఇన్నింగ్సు స్కోరు. ఇందులో 16 బౌండరీలు, 5 సిక్సర్లు ఉన్నాయి. తాత్కాలిక కెప్టెన్ మెకల్లమ్ టాస్ గెలిచి ఫీల్డంగ్ ఎంచుకున్నాడు.
యువరాజ్ సింగ్ ఔటయ్యాక, తన స్కోరు 163 వద్ద ఉండగా పొత్తి కడుపులో కండరాల నొప్పి కారణంగా టెండుల్కర్ రిటైరయ్యాడు. సెహ్వాగ్ 3, గంభీర్ 15 పరుగులుచేశారు. తరువాత బ్యాటింగ్ కు దిగిన ధోని, సురేశ్ రైనా జాగ్రత్తగా ఆడి స్కోరు బోర్డును పరుగులు తీయించారు. రైనా 18 బంతుల్లో ఐదు సిక్సర్లతో 38 పరగులతో నాటౌట్ గా మిగిలాడు. కెప్టెన్ ధోని 58 బంతుల్లో 68 పరుగులు చేశాడు. టెండుల్కర్ తో కలసి నాలుగో వికెట్ భాగస్వామ్యానికి 100 పరుగులు జోడించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ ప్రసవ సమయం దగ్గరపడుతున్న తన భార్య వద్దకు వెళ్లడంతో, అతడి స్థానంలో బ్రెండన్ మెకల్లమ్ న్యూజిలాండ్ జట్టుకు సారథ్యం వహించాడు. వెట్టోరి స్థానంలో జీతన్ పటేల్, ఇయాన్ ఓబ్రియన్ స్థానంలో టిమ్ సౌదీ ఆడారు.
News Posted: 8 March, 2009
|