విశాఖకు ఐపిఎల్ ఓకె
ముంబాయి: ఇండీయన్ ప్రీమీయరం లీగ్(ఐపిఎల్) రెండో సీజన్ మ్యాచ్ లు నిర్వహించే నగరాలుగా విశాఖపట్నం, అహ్మదాబాద్ లను ఖాయం చేసినట్టు లీగ్ కమిషనర్ లలిత్ మోడి తెలిపారు. పోటీలు జరిగే తేదీల ఖరారుకు ఇంకా కసరత్తు జరుగుతోందని మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన తెలిపారు. ప్రస్తుత షెడ్యూలులో ఒక్క మ్యాచ్ ను మార్చినా మొత్తం క్రమాన్ని మార్చవలసి ఉంటుందని, కొత్త షెడ్యూలుకు తుది మెరుగులు దిద్దుతున్నామని మోడి చెప్పారు. ధరమశాల, నాగపూర్ లను కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉందన్నారు. పోటీల ప్రారంభ, ముగింపు ఉత్సవాలు నవీ ముంబాయిలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగతాయి. అయితే ముంబై ఇండియన్స్ జట్టు మాత్రం తమ మ్యాచ్ లు ఏడింటిని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సిసిఐ) స్టేడియంలో ఆడుతుంది.
భద్రతా ఏర్పాట్ల గురించి విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు మోడి జవాబిస్తూ, కేంద్రీకృతమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, గత సంవత్సరం ఆటగాళ్ల భద్రత బాధ్యతను ఆయా జట్లే స్వీకరించగా, ఈ యేడాది సెక్యూరిటీ బడ్జెట్ పది రెట్లు పెరిగిపోయిందని వివరించారు. ఆయా నగరాల పోలీసు కమిషనర్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. మ్యాచ్ లను ఏయే తేదీలలో నిర్వహించరాదో తెలియజేయాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను కోరామని, కొత్త తేదీలతో సవరించిన షెడ్యూలును తయారు చేస్తున్నామని, తాము సమర్పించిన షెడ్యూళ్లలో 90 శాతం ఆమోదం పొందాయని, ఇంకా ఐదు రాష్ట్రాల నుండి ధ్రువీకరణతో సమాధానం అందాలని మోడి వివరించారు. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి సూత్రప్రాయంగా అంగీకారం లభించిందని, అన్ని రాష్ట్రాల నుండి లిఖితపూర్వకంగా అంగీకారం అందిన తరువాత తుది షెడ్యూలును ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
News Posted: 10 March, 2009
|