హోళి రోజున 'వీర' కేళి!
హామిల్టన్: వన్డే ఇంటర్నేషల్స్ చరిత్రలో అత్యంత వేగవంతమైన ఏడో సెంచరీ టీమ్ ఇండియాకు కివీస్ పై సిరీస్ విజయాన్ని చేకూర్చిపెట్టింది. అరవై బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసిన వీరేంద్ర సెహ్వాగ్ తన ఫామ్ ను మరోసారి రుజువు చేసుకున్నాడు. బుధవారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందడంతో పాటు 3-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇంతవరకూ జరిగిన అన్ని మ్యాచ్ ల్లాగే ఇక్కడ కూడా వర్షం వదల్లేదు. విశేషం ఏమిటంటే, భారత బ్యాట్స్ మెన్ లో అత్యంత వేగవంతమైన సెంచరీగా ఇక్కడి సెహ్వాగ్ స్కోరు రికార్డు పుటల్లో చేరడం.
ఇంతవరకూ ఈ రికార్డు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్(21 సంవత్సరాల క్రితం బరోడాలో న్యూజిలాండ్ పై62 బంతులలో)పేరిట ఉంది. 'ఇక్కడి పిచ్ ల స్వభావం నాకు బాగా తెలుసు. 2003లో ఇక్కడకు వచ్చినప్పుడు రెండు సెంచరీలు చేశాను. ఇలా ఆడడం నాకు బలే సరదా. ఈ సారి ఇక్కడ పిచ్ లు బ్యాటింగ్ కు బాగా అనుకూలించాయి' అన్నాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సెహ్వాగ్. అతడి స్కోరులో 14 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. సెహ్వాగ్ అర్ధ సెంచరీ 31 బంతుల్లో పూర్తి కాగా, జట్టు స్కోరు 69 బంతుల్లో, 54 నిముషాల్లో 100 పరుగులకు చేరుకుంది. సెహ్వాగ్ సెంచరీ 87 నిముషాల్లో పూర్తయింది.
News Posted: 11 March, 2009
|