భారత్ చారిత్రక విజయం
హామిల్టన్: న్యూజిలాండ్ లో వన్డే సిరీస్ ను భారత జట్టు తొలిసారి గెలుచుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డే మ్యాచ్ లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందడంతో పాటు 3-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ 47 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేయగా, వర్షం అంతరాయం కారణంగా, డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ధోనిసేన 23.3 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా సాధించింది. కివీస్ బ్యాట్స్ మెన్ లో ఓపెనర్లు జెస్సీ రైడర్ 46, బ్రెండన్ మెకల్లమ్ 77, పిడి మెక్ గ్లషన్ 56(నాటౌట్), జిడి ఎలియట్ 35(నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్ ఒక్కొక్కటి వికెట్లు పడగొట్టారు.
ఇంతవరకూ జరిగిన అన్ని మ్యాచ్ ల్లాగే ఇక్కడ కూడా వర్షం వదల్లేదు. సెహ్వాగ్ 125, గౌతమ్ గంభీర్ 63 పరుగులు చేశారు. వన్డే ఇంటర్నేషనల్స్ చరిత్రలో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం మరో ప్రపంచ రికార్డు. 'ఇక్కడి పిచ్ ల స్వభావం నాకు బాగా తెలుసు. 2003లో ఇక్కడకు వచ్చినప్పుడు రెండు సెంచరీలు చేశాను. ఇలా ఆడడం నాకు బలే సరదా. ఈ సారి ఇక్కడ పిచ్ లు బ్యాటింగ్ కు బాగా అనుకూలించాయి' అన్నాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సెహ్వాగ్. అతడి స్కోరులో 14 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. వర్షం మూడు సార్లు అంతరాయం కలిగించిన ఇండియా ఇన్నింగ్సులో మనవాళ్లు క్రీజులో ఉన్నది 139 నిముషాలే! సెహ్వాగ్ అర్ధ సెంచరీ 31 బంతుల్లో పూర్తి కాగా, జట్టు స్కోరు 69 బంతుల్లో, 54 నిముషాల్లో 100 పరుగులకు చేరుకుంది. సెహ్వాగ్ సెంచరీ 87 నిముషాల్లో పూర్తయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు రెండు సార్లు వర్షం వల్ల అంతరాయం కలుగగా, అంపైర్లు ఆటను 47 ఓవర్లకు కుదించారు.
News Posted: 11 March, 2009
|