వానే విలన్ : ధోని
హామిల్టన్: 'వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ నిన్నటి మ్యాచ్ లో లక్ష్య సాధన నల్లేరు మీద నడకే అనిపించారు. కాని వర్షం పడి ఆటకు అంతరాయం కలిగినప్పుడల్లా చేయాల్సిన పరుగుల సంఖ్య మారిపోతుండడంతో లక్ష్య సాధన సులభ సాధ్యం కాదనిపించింది'అన్నాడు అంతిమ విజయాన్ని అలవోకగా చేజిక్కించుకున్న టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. సెహ్వాగ్, గంభీర్ బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే గెలుపు సులభమేనని అనిపించిందని, కాని అనుకున్నంత సులభంగా విజయం వరించ లేదని ధోని అన్నాడు. మైదానంలో పరిస్థితులు బ్యాటింగుకు అనుకూలంగా లేకపోయినా, ఓపెనర్లు ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించి ఆటను తమకు అనుకూలంగా మర్చేశారని ధోని ప్రశంసించాడు.
'ఆట మొదలైనప్పటి నుండి బలమైన గాలులు వీస్తూనే ఉన్నాయి. మొత్తంమీద ప్రారంభంలో పరుగులు త్వరత్వరగా రావడంతో ఆ తరువాత లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమయింది. ప్రస్తుతం భారత జట్టు ఏ ఒక్క ఆటగాడి సామర్ధ్యం మీద ఆధారపడడం లేదు. సమిష్టిగా ఆడి 3-0 తో వన్డే సిరీస్ కైవసం చేసుకున్నాం. అవసరమైనప్పుడల్లా బౌలర్లు కాని, బ్యాట్స్ మెన్ కాని ఆదుకుంటున్నారు. ఈ రోజు సచిన్ టెండుల్కర్ జట్టులో లేక పోయినా ఆ లోటేమీ కనిపించలేదు' అన్నాడు ధోని.
News Posted: 12 March, 2009
|