ఐపిఎల్ కు ఆంధ్ర షాక్
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) కమిషనర్ లలిత్ మోడీకి ఆంధ్ర పోలీసులు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో జరిగే పోటీలకు భద్రత కల్పించడం సాధ్యం కాదని గురువారం తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలో రెండు విడతల పోలింగు పూర్తయ్యాక, ఏప్రిల్ 23 తరువాత మాత్రమే ఐఫిఎల్ పోటీలకు భద్రతా దళాలను సమకూర్చడం వీలవుతుందని ఆంధ్పప్రదేశ్ పోలీసు అధికారులు కేంద్ర హోం శాఖకు లేఖ రాసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో పోటీలు నిర్వహించదలచుకుంటే పోటీల తేదీలను కూడా మార్చాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారట. ఆంధ్రతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ కూడా హోం శాఖకు భద్రతా ఏర్పాట్ల గురించి ఇంకా లేఖలు రాయవలసి ఉంది.
ఈ యేడాది ఐపిఎల్ పోటీలు నిర్వహించే నగరాల జాబితాలో విశాఖపట్నాన్ని చేర్చినట్టు లలిత్ మోడీ ఇదివరకే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల లేఖతో ఇప్పుడు అసలు టోర్నమెంట్ జరుగుతుందా అన్న సందేహానికి తెర తీసినట్టయింది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డక్కన్ ఛార్జర్స్ జట్టు ఆ నగరంలో తన లీగ్ మ్యాచ్ లు ఆడే పరిస్థితి కూడా సందిగ్ధంలో పడింది. గత సంవత్సరం రన్నర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ చెన్నైలో లీగ్ మ్యాచ్ లు ఆడే విషయమై, పోలింగు తేదీల కారణంగా, ఇప్పటికే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
News Posted: 12 March, 2009
|