క్లీన్ స్వీప్ కు ఇండియా రెడీ
ఆక్లండ్: వన్డే సిరీస్ లో భారత జట్టు విజయం సాధించినా ఐదో మ్యాచ్ కూడా గెలుపొంది 'క్లీన్ స్వీప్' చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి ఈడెన్ పార్క్ మైదానంలో జరిగే చివరి పోటీలో రిజర్వుడు ఆటగాళ్లను బరిలోకి దిపాలని కెప్టెన్, మేనేజర్లు యోచిస్తున్నారు. గాయం కారణంగా నాలుగో మ్యాచ్ లో రెస్ట్ తీసుకున్న సచిన్ టెండుల్కర్ ఐదో మ్యాచ్ లో విశ్రాంతి తీసుకుని, ఈ నెల 18 నుంచి జరిగే టెస్ట్ సిరీస్ కు పూర్తి ఫిట్ నెస్ తో ఉండాలనుకుంటున్నారు. భారత జట్టుకు ఇంతవరకూ పరిస్థితులు అనుకూలంగా ఉండగా, కివీస్ జట్టు ఈ మ్యాచ్ ను ఎలాగైనా గెలుపొందాలన్న పట్టుదలతో ఉంది. స్వదేశంలో వరుసగా ఆరు సిరీస్ గెలుపొందడం అదృష్టం వల్ల కాదని, వన్డే పోటీల్లో తాము కూడా విజయాలు సాధించగల జట్టేనని నిరూపించుకోవాలని న్యూజిలాండ్ తహతహలాడుతోంది.
అయితే సిరీస్ విజయంతో సంబంధం లేని ఐదో వన్డే మ్యాచ్ ను తేలికగా తీసుకోవడం లేదని భారత జట్టు కోచ్ గారీ కిర్ స్టెన్ స్పష్టంగా చెప్పాడు. వన్డే సిరీస్ ఊపుతోనే మూడు టెస్ట్ లలో కూడా విజయ పరంపర కొనసాగించాలని అతడు భావిస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రగ్యాన్ ఓఝా, మీడియం పేసర్ ఇర్ఫాన్ పఠాన్, స్వదేశానికి తిరిగి వెళ్లే ముందు ఒక వన్డే పోటీలో ఆడే అవకాశం పొందనున్నారు. ఈ సిరీస్ ముగిశాక వారిద్దితో పాటు యూసుఫ్ పఠాన్, ప్రవీణ్ కుమార్, రోహిత్ శర్మ ఆదివారం తిరుగు ప్రయాణమవుతారు. ఇశాంత్ శర్మ పక్కన కూర్చున్న కారణంగా నాలుగు వన్డేల్లో పూర్తి బౌలింగ్ భారం వహించిన జహీర్ ఖాన్ కూడా చివరి వన్డేకు రెస్ట్ తీసుకుని, టెస్ట్ సిరీస్ కు సిద్ధమయ్యే అవకాశం ఉంది. న్యూజిలాండ్ లోని మైదానాల్లో అతి చిన్నదైన ఇక్కడి ఈడెన్ పార్క్ లో ఎన్ని బంతులు కనిపించకుండా పోతాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇంతవరకూ జరిగిన రికార్డు సంఖ్యలో(ట్వంటీ మ్యాచ్ ల్లో 24, వన్డే మ్యాచ్ ల్లో 31)సిక్సర్లు రికార్డయ్యాయి.
News Posted: 13 March, 2009
|