'జంబో' జట్లే ఎక్కువ!
ముంబాయి: వచ్చే నెల 10వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఐపిఎల్ రెండో సీజన్ లో, 80 మంది విదేశళీ క్రికెటర్లతో సహా మొత్తం 269 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. పాకిస్తాన్ మినహా, ఐసిసి పూర్తిస్థాయి సభ్య దేశం జింబాబ్వేతో సహా ఎనిమిది టెస్ట్ స్థాయి దేశాలకు ఈ సారి ట్వంటీ టోర్నమెంట్ లో ప్రాతినిధ్యం లభిస్తుందని ఒక పత్రికా ప్రకటన తెలియజేసింది. చట్టబద్ధమైన ఐపిఎల్ మార్గదర్శక సూత్రాల ప్రకారం వివిధ ఫ్రాంచైజీలు కాంట్రాక్టు కుదుర్చుకున్న అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు భారతదేశానికి చెందిన ఫస్ట్ క్లాస్, అండర్-22, అండర్-19 ప్లేయర్లు అనేకమందిని అన్ని జట్లలోను చేర్చారు. కింగ్స్ లెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లలో 14, 15 మంది భారత క్రికెటర్లు ఉన్నారు. జంబో జట్టుగా పేరు పొందిన కోల్కటా నైట్ రైడర్స్ లో 47 మంది భారత క్రికెటర్లతో సహా మొత్తం 57 మంది ఆటగాళ్లున్నారు. గత సంవత్సరం చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, రన్నర్ అప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లలో పాతికేసి మంది భారత క్రికెటర్లున్నారు. అలాగే బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టులో 32 మంది భారత క్రికెటర్లతో సహా మొత్తం 42 మంది ఆటగాళ్లున్నారు.
News Posted: 13 March, 2009
|