'ఇండియాలోనే ఐపిఎల్'!
ఢిల్లీ: మూడో అంపైర్ నిర్ణయం కోసం ఆటగాళ్లు, ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి చూస్తున్నట్టే ఉంది. ఐపిఎల్ రెండో సీజన్ జరుగుతుందా, లేదా! హోం మంత్రిత్వ శాఖ 'యస్' అంటుందా లేక 'నో' అంటుందా? మీరు చెప్పిన తేదీల్లో భద్రతా ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదు కాబట్టి షెడ్యూలు మార్చండి అంటూ చిదంబరం తేల్చి చెప్పేశారు. ఎన్నికల సమయంలో భద్రతా దళాలను ఇవ్వడం సాధ్యం కాదని హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ చెప్పాయి. నాలుగు మ్యాచ్ లకు ఓకె అన్న బెంగుళూరు మరో రెండు మ్యాచ్ తేదీలకు లాభం లేదనేసింది. ఎన్నికల విధులకు రాష్ట్ర పోలీసులు అవసరం లేకపోతే మేం సిద్ధమే అన్నాయి మొహాలి, కోల్కటా. ఐపిఎల్ పోటీలకు హోం శాఖ పచ్చ జెండా ఊపిందని లలిత్ మోడి చెప్పిన తరువాత పడిన బౌన్సర్ లు ఇవి!
దేశంలో ఎన్నికలు ముంచుకు వచ్చేస్తున్న తరుణంలో, 'ఐపిఎల్ మ్యాచ్ లు ఇండియాలోనే జరుగుతాయి' అని చిదంబరం ప్రకటించడాన్ని బట్టి చూస్తే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ రాజకీయ, భద్రతా వ్యవహారాల సమస్య అయి కూర్చుంది. అయినప్పటికీ, పాకిస్తాన్ లో కాకపోతే పొరుగు దేశం ఇండియాలో క్రికెట్ భద్రంగానే ఉందని చాటి చెప్పడానికి అన్నట్టుగా, భద్రతను పక్కన పెట్టి, ప్రభుత్వ షరతులకు లోబడి ఐపిఎల్ మ్యాచ్ లు ఇండియాలోనే జరుగుతాయి అని హోం మంత్రిగారు చెప్పడంలో పరమార్ధమేమిటో ఆయనకే తెలియాలి.
News Posted: 14 March, 2009
|