ఐపిఎల్ కు తొలగని తెర
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)రెండో సీజన్ అతీ గతీ ఇంకా తేలలేదు. కేంద్ర హోం శాఖ, ఐపిఎల్ నిర్వాహకుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి ఎన్ శ్రీనివాసన్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల బృందం హోం శాఖలోని ఆంతరంగిక భద్రతా వ్యవహారాల విభాగం ప్రత్యేక కార్యదర్శి రామన్ శ్రీవాస్తవను కలుసుకుని ఐపిఎల్ మ్యాచ్ ల తేదీలపై చర్చించింది. పోటీలకు భద్రత కల్పించే విషయంలో హోం శాఖ పరిమితులు, సమస్యలను శ్రీవాస్తవ వివరించి, మ్యాచ్ లు జరిగే రాష్ట్రాలను సంప్రదించి కొత్త షెడ్యూలును తయారుచేయాలని బిసిసిఐ బృందాన్ని కోరారు. లోక్ సభ ఎన్నికల కారణంగా ఐపిఎల్ ట్వంటీ టోర్నమెంట్ కు కేంద్ర బలగాలను సమకూర్చలేమని బిసిసిఐకి హోం శాఖ స్పష్టం చేసింది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సవివరంగా సంప్రదింపులు జరపాలని నిర్వాహకులను కోరింది.
'హోం శాఖ అధికారులతో అన్ని విషయాలు చర్చించాం. కొత్త షెడ్యూలు అందిన తరువాత హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తుంది' అని బిసిసిఐ కార్యదర్శి శ్రీనివాసన్ విలేఖరులకు చెప్పారు. సోమవారం జరిగిన ఈ చర్చల అనంతరం ఒక తాత్కాలిక షెడ్యూలు విడుదల కావచ్చని తొలుత భావించారు, కాని అటువంటిదేమీ జరుగలేదు. ఐపిఎల్ టోర్నమెంట్ ఏప్రిల్ 20న ప్రారంభం కావలసు వుంది. కొత్త తేదీలను నిర్ణయించే ముందు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించడం జరిగిందని, సవరించిన షెడ్యూలును హోం శాఖకు సమర్పించే ముందు ఐపిఎల్ కమిషనర్ లలిత్ మోడి మీడియాకు చెప్పారు. అయితే టోర్నమంట్ నిర్వాహకులెవరూ తమతో మాట్లాడ లేదని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడంతో హోం శాఖ కంగు తింది. ఐపిఎల్ నిర్వాహకులు ఇంతకుముందు సమర్పించిన సవరించిన షెడ్యూల్ ను హోం శాఖ మార్చి 13న తిరస్కరించింది. ఆ షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ లు జరగడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొంది.
News Posted: 16 March, 2009
|