ధోనీసేనకు 'బౌన్సీ'టెస్ట్?
హామిల్టన్: బుధవారం నుండి ఇక్కడ ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్ కోసం గడ్డి బాగా వున్న బౌన్సీ పిచ్ ను తయారు చేశారు. భారతీయ బ్యాట్స్ మెన్ కు కొంచెం ఇబ్బంది కలిగించే ఈ పరిస్థితిలో బ్యాట్ కు, బంతికి మధ్య భయంకర పోరాటం తథ్యమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆక్లండ్ లోని జరిగిన చివరి వన్డే మ్యాచ్ లో ధోనీ సేనను ముప్పతిప్పలు పెట్టిన కివీస్ బౌలర్లు ఇక్కడ కూడా అలాగే విజృంభిస్తారని, ఈ సిరీస్ లో మంచి దూకుడుగా ఆడుతున్న సెహ్వాగ్ తదితర బ్యాట్స్ మెన్ ను స్వంగ్ బౌలింగుతో కట్టడిచేస్తారని ఇక్కడి పిచ్ చూస్తే అర్ధమైపోతుంది. కొంచెం ఎక్కువగా ఉన్న గడ్డిని కత్తిరించేస్తామని క్యురేటర్ కార్ల్ జాక్సన్ చెప్పినప్పటికీ, మబ్బుపట్టిన వాతావరణంలో ప్రమాదకరమైన బంతులు వేసే సీమర్లు ఇక్కడ రెచ్చిపోయే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయి. అందువల్ల స్వంగ్ బౌలింగ్ లో చేయితిరిగిన ఫ్రాంక్లిన్ జేమ్స్ సారథ్యంలోని న్యూజిలాండ్ సీమ్ బౌలర్లను భారత బ్యాట్స్ మెన్ చాలా జాగ్రత్తగా ఎదుర్కోవలసి వుంటుంది.
మిలిన సీమర్లు కైల్ మిల్స్, ఇయాన్ ఓ బ్రియన్, క్రిస్ మార్టిన్, బ్రెంట్ ఆర్నెల్ కూడా తమ సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకూ ఆడిన 89 టెస్ట్ మ్యాచ్ లలో 286 వికెట్లు తీసుకున్న లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ డేనియల్ వెట్టోరి, సీమర్లు విఫలమైతే, బ్యాట్స్ మెన్ భరతం పట్టడానికి ఎప్పుడూ సిద్ధమే. అయితే సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి అనుభవజ్ఞులైన బ్యాట్స్ మెన్ కివీల్ బౌలర్లను 'ఆట'పట్టిస్తారనడానికి ఏ మాత్రం సందేహించనవసరం లేదు. అలాగే బౌలర్లు జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, లక్ష్మీపతి బాలాజీ, హర్భజన్ సింగ్ ఎటువంటి పిచ్ ల మీద అయినా వికెట్లు పడగొట్టగల అనుభవం సంపాదించారు. అందువల్లనే పూర్తిగా సీమ్ బౌలింగుకు అనుకూలించే పిచ్ కోసం అడగదలచుకో లేదని, పోటీ ఏకపక్షంగా ఉండకూడదని న్యూజిలాండ్ కోచ్ ఆండీ మోల్స్ చెప్పాడు.
News Posted: 16 March, 2009
|