'11కే టెస్ట్ స్టార్ట్'
హామిల్టన్: న్యూజిలాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ ను మిట్ట మధ్యాహ్న 12 గంటలకు ప్రారంభించాలన్న సంప్రదాయ విరుద్ధ నిర్ణయం పట్ల భారత కెప్టెన్ ఎమ్మెస్ ధోని ఆందోళనకు తెర పడింది. షెడ్యూలు ప్రకారం బుధవారం ఉదయం 11 గంటలకే ఇక్కడి స్నెడన్ పార్కులో టెస్ట్ ప్రారంభమవుతుందని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. 'మధ్యాహ్నం 12 గంటలకు మ్యాచ్ ప్రారంభించడం మాకు చాలా ఇబ్బందికరం. రాత్రిపూట ఆడుతున్నట్టు ఉంటుంది. ఎప్పుడు మగుస్తుందో తెలియనంతగా అలా కొనసాగుతూనే ఉంటుంది. 12 గంటలకు ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ నేనింత వరకూ ఆడలేదు. అది తప్పకుండా ఆందోళన కలిగించే విషయమే' అని ధోని మీడియాతో మాట్లాడుతూ చెప్పాడు. భారతదేశంలో మరింత మంది ప్రేక్షకులను ఆకర్షించే అవకాశాలతో సహా టెస్ట్ మ్యాచ్ షెడ్యూలింగ్ ఏర్పాట్లపై న్యూజిలాండ్ క్రికెట్, సోనీ టెలివిజన్ చర్చలు జరిపాయి. సోనీతో పాటు రెండు జట్ల ప్రతినిధులు, మ్యాచ్ అధికారులతో చర్చించిన మీదట మొదటి టెస్ట్ ప్రారంభ సమయం 11 గంటలేనని ప్రకటించారు. నేపియర్(మార్చి 26-30), వెల్లింగ్టన్(ఏప్రిల్ 3-7)లలో జరిగే టెస్ట్ మ్యాచ్ ల ప్రారంభ సమయాలను కొద్ది రోజుల్లో ఖరారు చేస్తారు.
News Posted: 17 March, 2009
|