ఐపిఎల్ కొత్త షెడ్యూల్
న్యూఢిల్లీ: ఐపిఎల్ ట్వంటీ 20 క్రికెట్ టోర్నమెంట్ ను ఎలాగైనా నిర్వహించాని పట్టుదలగా ఉన్న నిర్వాహకులు ఐపిఎల్ రెండో సీజన్ సరికొత్త షెడ్యూల్ ను హోం మంత్రిత్వశాఖకు సమర్పించారు. ఈ షెడ్యూల్ ను సవరించడం ఇది మూడోసారి. దీనిని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను తెలుసుకోడానికి పంపించినట్టు హోం శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. కాసుల వర్షం కురిపించే ఐపిఎల్ టోర్నమెంట్ వాయిదా పడకుండా శతవిధాలా ప్రయత్నిస్తున్న నిర్వాహకులు రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా సంబంధింత అధికారులతో చర్చలు జరుపుతూ కొత్త షెడ్యూల్ కు తుది మెరుగులు దిద్దారు.
పోటీల తేదీలను నామ్ కే వాస్తేగా మార్చకుండా, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి ఖరారు చేయాలని నిర్వాహకులకు హోం శాఖ గట్టిగా చెప్పింది. టోర్నమెంట్ ప్రారంభానికి నెల రోజుల లోపే వ్యవధి ఉన్న తరుణంలో రెండో షెడ్యూల్ ను హోం శాఖ తిరస్కరించడంతో, ఏప్రిల్ 10న ప్రారంభం కావలసిన ఐపిఎల్ రెండో సీజన్ భవితవ్యంపై సందేహాలు ముసురుకున్నాయి.
News Posted: 17 March, 2009
|