సోనీతో కటీఫ్ ఎందుకంటే?
ముంబాయి: గత సంవత్సరం నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ పోటీలను ప్రసారం చేసిన సమయంలో ఒప్పందంలోని షరతులను ఉల్లంఘించినందుకు సోనీ సంస్థకు చెందిన సెట్ మాక్స్ తో కాంట్రాక్టును రద్దు చేసినట్టు ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహక సంస్థ బిసిసిఐ ఆరోపించింది. ఐపిఎల్ కంటె వ్యాపార ప్రయోజనాలకే సెట్ మాక్స్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని ముంబాయి హైకోర్టులో బిసిసిఐ తరఫున కేసు వాదిస్తున్న న్యాయవాది ఆరోపించారు. ఈ విషయాన్ని ఈ యేడాది ఫిబ్రవరి 9న సోనీ కంపెనీకి తెలియజేశామని చెప్పారు. బిసిసిఐ నుంచి లేఖ అందినట్టు సోనీ అంగీకరించింది. ప్రతి ఓవర్ లో ఐదో బంతి తరువాత వ్యాపార ప్రకటనలను ప్రసారం చేశారని, దాంతో ఆరో బంతిని చూపించలేదని, అంతే కాకుండా బంతిని కెమేరాలు సరైన పద్ధతిలో అనుసరించలేదని బిసిసిఐ న్యాయవాదులు వివరించారు. అయితే ఇవి ప్రసారానికి సంబంధించిన సమస్యలని సోనీ తరఫు న్యాయవాదులు వాదించారు.
ఈ యేడాది మార్చి 14న బిసిసిఐ సోనీతో కాంట్రాక్టును ఫ్యాక్స్ సందేశం ద్వారా రద్దు చేసి, మార్చి 15 ఉదయమే వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ తో కొత్త కాంట్రాక్టుపై సంతకం చేసింది. కొత్త కాంట్రాక్టు ప్రకారం ఐపిఎల్ మ్యాచ్ లను భారతదేశంలో ప్రసారం చేయడానికి ఇతర చానెల్స్ తో తాజా ఒప్పందం కుదుర్చుకునే వీలుంది. బిసిసిఐపై సోనీ కంపెనీ మార్చి 15న బొంబాయి హై కేర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఐపిఎల్ కు సంబంధించి ఎవరితోనూ బిసిసిఐ ఏ విదమైన ప్రసార ఒప్పందాలు కుదుర్చుకోరాదని ఆంక్ష విధిస్తూ కోర్టు ఇంజంక్షన్ జారీ చేసింది. ఉభయ పక్షాల వాదోపవాదాలు విన్న పిదప కోర్టు త్వరలోనే తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.
News Posted: 18 March, 2009
|