లీడ్ కోసం ఇండియా పరుగు
హామిల్టన్: మొదటి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్సు స్కోరు ఆధిక్యం సాధించడానికి టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ పునాదులు వేశారు. రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి భారత జట్టు నూంజియాండ్ స్కోరుకు ఒక్క పరుగు వెనకబడి ఉంది. ఓపెనర్లు గౌతమ్ గంభీర్(72), వీరేంద్ర సెహ్వాగ్(24)లతో సహా నలుగురు బ్యాట్స్ మెన్ ఔటయ్యారు. రాహుల్ ద్రవిడ్ 66 పరుగులకు బ్రియన్ బౌలింగులోను, వివిఎస్ లక్ష్మణ్ 30 పరుగులకు మార్టిన్ బౌలింగులోను వికెట్లు కోల్పోయారు. సచిన్ టెండుల్కర్70, యువరాజ్ సింగ్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. కివీసే బౌలర్లలో మార్టిన్ 2, బ్రియన్ 1 వికెట్లు పడగొట్టగా, సెహ్వాగ్ రనౌట్ అయ్యాడు. 135 బంతులు ఎదుర్కొని 70 పరుగులు చేసిన టెండుల్కర్ కు తన స్కోరు 13 వద్ద ఉండగా కివీస్ స్పిన్నర్(కెప్టెన్) వెట్టోరి ఓవర్ లో లైఫ్ లభించింది. షార్ట్ మిడ్ వికెట్ నుంచి వెనక్కి పరుగెడుతూ వెళ్లి క్యాచ్ పట్టబోయిన డేనియల్ ఫ్లిన్ వేళ్లకి తగిలి బంతి కింద పడింది. ఈ ఒక్క సంఘటన మినహాయిస్తే భారతజట్టు ఇన్నింగ్సు నిదానంగా, సాఫీగా సాగిపోయింది. బుధవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో గురువారం ఆట 15 నిముషాలు ఆలస్యంగా ప్రారంభమయింది.
News Posted: 19 March, 2009
|