కష్టాల్లో కివీస్!
హమిల్టన్: మొదటి క్రికెట్ టెస్ట్ మూడో రోజునే న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. శుక్రవారం ాట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్సులో 75 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి, భారత జట్టు తొలి ఇన్నింగ్సు స్కోరు కంటె ఇంకా 166 పరుగులు వెనకబడి ఉంది. జహీర్ ఖాన్ వేసిన మొదటి ఓవర్ మూడో బంతికే న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తరువాత డేనియల్ ఫ్లిన్, మార్టిన్ గుప్టిల్ రెండో వికెట్ కు 48 పరుగులు జత చేసిన తరువాత హర్భజన్ సింగ్, గుప్టిల్ ను పెవిలియన్ కు పంపించాడు. తరువాత కైల్ మిల్స్ రెండు పరుగులు మాత్రమే చేసి మునాఫ్ పటేల్ బంతికి బలైపోయాడు. టిమ్ మెకింటోష్ డకౌట్!
అంతకుముందు, జహీర్ ఖాన్ భారత ఉపఖండం వెలుపల తన తొలి అర్ధ సెంచరీ(51 నాటౌట్) సాధించడం మూడో రోజు విశేషాల్లో ఒకటి. చివరి వికెట్ ను కోల్పోయే ముంది టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్సులో 520 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ లోగా తన 42వ సెంచరీ పూర్తి చేసుకున్న సచిన్ టెండుల్కర్ 160 పరుగులకు ఇయన్ ఓబ్రియన్ ఓవర్ లో ఔటయ్యాడు. యువరాజ్ సింగ్ 22, ధోనీ 47, హర్భజన్ సింగ్ 16, ఇషాంత్ శర్మ 6, మునాఫ్ పటేల్ 9 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మార్టిన్ 3, మిల్స్ 1, ఓ బ్రియన్ 3, వెట్టోరి 2 వికెట్లుపడగొట్టారు. స్నెడన్ పార్క్ పిచ్ భారత బౌలర్లకు బాగా అనుకూలిస్తున్నందు వల్ల నాలుగో రోజుకే విజయాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News Posted: 20 March, 2009
|